లాక్‌డౌన్‌ కొనసాగింపుకే సర్వత్రా సుముఖత 

కరోనా మహమ్మారిని కట్టడి  చేయడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన మూడు వరాల లాక్‌డౌన్‌ ఈ నెల 14తో ముగియనున్నందున, కొన్ని రోజుల సడలించాలని కొన్ని వర్గాల నుండి వినిపిస్తున్నా ప్రస్తుత పరిస్థితులలో పొడిగించడం పట్లనే దేశ వ్యాప్తంగా సుముఖత వ్యక్తం అవుతున్నది. 

లాక్‌డౌన్‌ ను పొడిగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గత రాత్రి చేసిన సూచన బాటలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే హోమ్ మంత్రి అమిత్ షా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

గడువు ప్రకారం ఈ నెల 14న  లాక్‌డౌన్‌ తొలగిస్తూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా తయారవుతాయని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

దేశంలో నమోదవుతున్న కేసులలో మూడవ వంతు మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, అసోం, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, తెలంగాణలలో ఉండటం గమనార్హం. లాక్‌డౌన్‌ను కొనసాగించడానికే  ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కోరుతున్నాయి. 

మహారాష్ట్రలో ఇప్పటివరకు 891 కేసులు నమోదు కాగా 45 మంది మృతి చెందారు. దానితో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో తాము లాక్‌డౌన్ కొనసాగింపు కోరుకుంటున్నామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె చెప్పారు.  ‘ఏప్రిల్‌ 15 తర్వాత లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేయబడుతుందని ఎవరూ అనుకోవద్దని’ మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేష్‌ తోప్‌ స్పష్టం చేశారు. 

తబ్లిగీ జమాత్‌ కారణంగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగాయని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులు  ప్రకటించారు. ఇప్పటివరకు  నమోదైన 305 కేసుల్లో 159 తబ్లిగీతో సంబంధం ఉన్నవారివేనని, ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాల్సిన అవసరంలేదని వారు పేర్కొన్నారు. 

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అసోంకు రావాలనుకునే వారిని అడ్డుకుంటామని, శాశ్వత నివాసం ఏర్పర్చుకున్న వారికి కూడా కొంతకాలంపాటు ఐఎల్‌పీ (ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌)వంటి పరిస్థితి అవసరమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వా పేర్కొన్నారు. 

పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ప్రభుత్వం విశ్వసించిన తర్వాత రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తామని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ప్రకటించారు. రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ ప్రభుత్వాలు సహితం ఇటువంటి అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నాయి. 

కూడా లాక్‌డౌన్ కొనసాగించాలని కోరతామ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆర్ధిక వ్యవస్ధను తర్వాతైనా చక్కబెట్టుకోవచ్చని, తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఆయన చెప్పారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా లాక్‌డౌన్ ఒక్కసారే ఎత్తివేయరాదని కోరారు. నెమ్మదిగానే ఈ ప్రక్రియ సాగాలని సూచించారు. లాక్‌డౌన్ మరో రెండు వారాలు కొనసాగించాలని కర్ణాటక ప్రభుత్వం కూడా కోరింది.