ఏపీలో రెడ్‌జోన్‌గా ఏడు జిల్లాలు 

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. లాక్‌డౌన్‌ అములలో మరింత కఠింనగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది.  రాష్ట్రంలోని ఏడు జిల్లాలను రెడ్‌జోన్‌గా ప్రకటించినట్టు తెలియడంతో మరింత అప్రమత్తమవుతున్నారు. విశాఖపట్నం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఆయా జిల్లాల్లో మరింత కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఇప్పటికే కరోనా కేసులు నమోదైన వ్యక్తుల ఇళ్లకు కిలోమీటరు మేర రాకపోకలు నిలిపివేయాలని, ఆ ప్రాంతాల్లో వైద్యశాఖ బృందాలతో రాపిడ్‌ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. హాట్‌స్పాట్లలో మరింతగా నిఘా పెంచింది.   

అలాగే పాజిటివ్‌ వ్యక్తులు ఉన్న ప్రాంతాలను జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. బాధితుల ఫోన్‌ నెంబర్లను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. వారు ఇంటి నుండి కదిలితే వెంటనే సమాచారం పోలీసుశాఖకు వెళ్లిపో తుంది. క్వారంటైన్లో ఉన్న వారిని పర్యవేక్షించేందుకు హౌస్‌సర్జన్లను నియమిస్తున్నారు. పాజిటివ్‌ వ్యక్తులకు నిరంతరం ఫోన్లో కాంటాక్టులో ఉండి వారి కదలికలను అంచనా వేస్తున్నారు. 

లాక్‌డన్‌ సడలించినా పాజిటివ్‌ వ్యక్తులు, రెడ్‌జోన్లో ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. హోం క్వారంటైన్లో ఉన్నవారిపై నిఘా ఏర్పాటు చేశారు. వారు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా లేదా అనే దానిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. కొంతమంది క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తు న్నారని ఫిర్యాదులు వస్తుండటంతో నిఘాను పటిష్టం చేశారు. 

క్వారంటైన్లో ఉంటున్న 20 మందికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే హాస్టల్‌ వార్డెన్లనూ క్వారంటైన్‌ కేంద్రాల పర్యవేక్షణకు నియమించారు. పట్టణ ప్రాంతాల్లో కరోనా ఎక్కువగా ఉండటంతో నిత్యావ సరాల వస్తువుల కొనుగోలు సమయాన్ని కుదించారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికి వారికి కాంటాక్టులో ఉన్న వారికి పరీక్షలు దాదాపు పూర్తి చేశామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. పూర్తిస్థాయిలో ర్యాపిడ్‌ సర్వే చేస్తున్నారు.  

 లాక్‌డౌన్‌ ఎత్తేసిన తరువాత ఐసోలేషన్‌, క్వారంటైన్లో ఉన్న వారందరూ ఎలా వ్యవహరించాలనే అంశంపై వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్లు, అధికారులు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిం చాలని, క్వారంటైన్లో ఉన్న వారు బయటకు రాకుండా చూడాలని  ఆమెసూచించారు. 

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తు తాయని ఆమె హెచ్చరించారు. పాజిటివ్‌గా తేలిన వ్యక్తులకు దగ్గరగా ఉన్న 65 ఏళ్ల పైబడిన వ్యక్తులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకునేలా చూడాలని అధికారులను కోరారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారిని కూడా రెడ్‌జోన్‌, హాట్‌స్పాట్లకు వెళ్లకుండా చూడాలని తెలిపారు.