చైనా గుట్టు విప్పితేనే కరోనాకు మందు  

కరోనాకు సంబంధించిన పచ్చినిజాలు చైనా బయటపెట్టాలని కరోనా కోరల నుంచి బయటపడ్డ అమెరికాలోని భారత సంసతి న్యాయవాది రవి బాత్రా డిమాండ్ చేశారు. అలాగైతేనే శాస్త్రవేత్తలు, వైద్యులు ఏదైనా పరిష్కారం కనిపెట్టగలరని ఆయన తెలిపారు. టీకా కనిపెట్టేంత వరకు ఎవరూ బయటకు వెళ్లలేరని స్పష్టం చేశారు. 

న్యూయార్క్ లో నివసించే బాత్రా, ఆయన కుటుంబ సభ్యులు ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నారు. చైనా గుట్టు విప్పితే అప్పుడే మన హీరో ఆంథోనీ ఫాసీ (అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య సలహాదారు) వీలైనంత త్వరలో టీకాను కనుగొంటారని పేర్కొన్నారు. మృత్యువుతో కరచాలనం చేసి వచ్చాను కదా.. ఏదైనా మంచిపని చేయాలని అనుకుంటున్నాను - అని బాత్రా చెప్పారు. 

టీకా కనిపెట్టేంత వరకు ఎవరూ పనికి వెళ్లలేరు.. ఆటలాడలేరు.. బడికి కూడా పోలేరు.. మనకు తెలిసిన జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు చచ్చిపోయాయి. కోలుకునే సూచనలు కూడా లేవు - అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుత రూపంలో ప్రపంచీకరణ కూడా కొనసాగలేదనిస్పష్టం చేశారు.  

విశ్వమహమ్మారి ముందు సాపేక్ష ఆధిక్యతా సూత్రం కూడా చచ్చిపోతుందని చెప్పారు. ప్రస్తుత వెంటిలేటర్లలోని విడిభాగాలు ప్రపంచమంతటా తయారయ్యాయని, ఇకముందు ఇది ఆగిపోతుందని బాత్రా జోస్యం చెప్పారు. అమెరికా తన సొంత వెంటిలేటర్లను, ఎన్-95 మాస్కులను తయారు చేసుకోవాల్సి వస్తుందనిపేర్కొన్నారు. ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని హెచ్చరించారు.