లాక్‌డౌన్‌ మరొకొన్ని రోజులు పొడిగించాలి 

మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ కొనసాగించాలన్నది తన అభిప్రాయమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సూచించారు. లేని పక్షంలో ఇప్పటి వరకు పాటించిన లాక్‌డౌన్‌ ప్రభావం వృద్దా కాగలదని హెచ్చరించారు. 

బోస్టన్ నివేదిక కూడా దేశంలో జూన్‌ 3వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగించాలని పేర్కొందని ఆయన గుర్తు చేశారు. కరోనా కారణంగా ఆర్థికంగా దేశం దెబ్బతింటోందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఇబ్బందులు వస్తాయని.. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. 

లాక్‌డౌన్‌ కొనసాగింపుపై చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూ ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి కూడా సూచించినట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ వల్లే కరోనా వైరస్‌ను అదుపు చేయగలిగామని చెబుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ వైరస్‌తో చనిపోయిన వారంతా మర్కజ్‌ వెళ్లొచ్చిన వారేనని చెప్పారు. 

అమెరికా లాంటి పరిస్థితులు దేశంలో లేకపోవడం మన అదృష్టమని చెబుతూ దేశ జనాభాతో పోలిస్తే కరోనా పాజిటివ్‌ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు.  కరోనా వైరస్‌ భయానక పరిస్థితులు లేవని పేర్కొన్నారు. 22 దేశాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతోందని, జపాన్‌లో నెలపాటు లాక్‌డౌన్‌ ప్రకటించారని వివరించారు. 

కాగా, ఇక 90 దేశాలు పాక్షిక లాక్‌డౌన్ పాటిస్తున్నాయని చెబుతూ అత్యంత శక్తివంతమైన దేశం అమెరికాలో శవాల గుట్టలు కనిపిస్తున్నాయని అన్న కేసీఆర్ దేశంలో లాక్‌డౌన్ వల్ల కరోనా ఉధృతి తగ్గిందని చెప్పారు. 

లాక్‌డౌన్‌ వల్ల మన దేశం, రాష్ట్రం అద్భుతమైన గణనీయమైన విజయం సాధించింది. ఈ విషయంలో సందేహం అవసరం లేదు అని సీఎం స్పష్టం చేశారు  లాక్‌డౌన్‌ విధించకపోతే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే వాళ్లమని పేర్కొన్నారు.