ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత   

కరోనా వైరస్ దేశ ఆర్ధిక వ్యవస్థపై చూపనున్న దుష్ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రి వర్గం రెండు కీలక నిర్ణయాలు తీసుకోంది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నేడు జరిగిన సమావేశంలో పార్లమెంట్ సభ్యుల వేతనాలు, బత్యాలలో ఏడాది పాటు 30 శాతం మేరకు కొత్త విధించాలని నిర్ణయించారు. 

ఎంపీల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్లలో ఈ కోతను వర్తింప చేస్తూ  పార్ల‌మెంటు స‌భ్యుల జీతాలు, పెన్ష‌న్ల చ‌ట్టం-1954కు సవరణ తీసుకొస్తూ ఒక ఆర్డినెన్సు ను మంత్రివర్గం ఆమోదించింది. 

అదే విధంగా పార్లమెంట్ సభ్యులకు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఇస్తున్న  ఎంపీ లాడ్స్ నిధులను (రూ.7900 కోట్లు) రెండేళ్ల పాటు నిలిపేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ మొత్తం సొమ్మును క‌న్సాలిడేటెడ్ ఫండ్ కు బ‌దిలీ చేయ‌నున్నామ‌న్నారు.  

మరోవంక,  కరోనా నేపథ్యంలో ప్రస్తుత స్థితిని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తూ తమ వేతనాల్లో కూడా 30 శాతం కోతకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల గవర్నర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. 

భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 693 మందికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో  దేశవ్యాప్తంగా  4067 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 

కాగా, 291 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. గత 24 గంటల్లో 30 మంది మహమ్మారి కారణంగా చనిపోవడంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 109కు చేరింది.   మొత్తం బాధితుల్లో 1445 కరోనా కేసులు మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారివే.  

కరోనా  బాధితుల్లో 76శాతం పురుషులు ఉండగా..24శాతం మంది మహిళలు ఉన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఇప్పటికే రూ.1100 కోట్లు విడదల చేయగా.. అదనంగా మరో రూ 3,000 కోట్లను ఇవాళ రాష్ట్రాలకు విడుదల చేశామని  అగర్వాల్ వెల్లడించారు.