కోవిడ్-19 కోరల నుంచి భారత్‌ను విముక్తి చేద్దాం  

కోవిడ్-19 కోరల నుంచి భారత్‌ను విముక్తి చేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని బిజెపి కార్యకర్తలకు పిలుపిచ్చారు.  బీజేపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక సూచనలు చేశారు. 

సామాజిక దూరంపై ప్రజలకు అవగాహన కల్పించడం, లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయడం, కోవిడ్-19ను తరిమి కొట్టడమే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. 

ఇవాళ ట్విటర్ వేదికగా మోదీ స్పందిస్తూ... ‘‘పార్టీ ‘స్థాపన దివస్’ సందర్భంగా తోటి బీజేపీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు. దశాబ్దాలుగా బీజేపీ నిర్మాణం కోసం చెమటోడ్చి పనిచేసిన వీరులకు వినమ్ర శ్రద్ధాంజలి.. వారి కష్టం వల్లే ఇవాళ బీజేపీకి కోట్లాదిమంది భారతీయులకు సేవ చేసే అవకాశం దక్కింది...’’ అని ప్రధాని పేర్కొన్నారు.

బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సుపరిపాలన, పేదల సాధికారతే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘‘పార్టీ సంప్రదాయం ప్రకారం, అనేక మంది జీవితాల్లో సానుకూల మార్పు తీసుకొచ్చేలా కార్యకర్తలు కృషిచేశారు. గొప్ప సామాజిక సేవ చేశారు" అని కొనియాడారు. 

"కోవిడ్-19పై యుద్ధం చేస్తున్న సమయంలోనే మా పార్టీ 40వ వ్యవస్థాపక దినోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలంతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలను పాటించాలని... అవసరతలో ఉన్న వారికి సాయం చేయడంతో పాటు, సామాజిక దూరంపై అవగాహన కల్పించాలని కోరుతున్నాను....’’ అని మోదీ ట్వీట్ చేశారు.