కరోనా హాట్ స్పాట్లలో అందరికీ టెస్టులు

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హాట్ స్పాట్లలో అందరికీ టెస్టులు చేయించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. మర్కజ్ వెళ్లొచ్చిన  వాళ్లు రాష్ట్రంలో సుమారు వంద మందికి వైరస్‌ను అంటించారు. ఇందులో అధికశాతం కుటుంబ సభ్యులే ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల ఇతరులకూ వైరస్ వ్యాపించినట్టు అధికారులు గుర్తించారు. 

మర్కజ్‌లో పాల్గొన్నవారు, మార్చి 17 నుంచి 21 మధ్య వివిధ రైళ్లలో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చారు. వీళలో 160 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. ఇందులో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ , నిజామాబాద్‌, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. 

ఆయా ప్రాంతాల్లో వైరస్ కేంద్రాలను గుర్తిస్తున్న ప్రభుత్వం .. అక్కడ నివసిస్తున్న ప్రజలందరికీ కరోనా టెస్టులు చేయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల 14 వరకే టెస్టులు పూర్తిచేయాలని భావిస్తోంది. లేదంటే, టెస్టులు పూర్తయ్యేవరకూ ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  

జీహెచ్‌ఎంసీ పరిధిలో పాజిటివ్‌ కేసులు నమోదైన యూసఫ్‌గూడ, చంచల్‌గూడ, సికింద్రాబాద్, దారుషిఫా, మహేంద్రహిల్స్, ఎంజే రోడ్, నాంపల్లి, ఎమ్మెల్యే కాలనీ, న్యూమలక్‌పేట, నారాయణగూడ, ఖైరతాబాద్, మణికొండ, రాజేంద్రనగర్, షాద్‌నగర్, కుత్బుల్లాపూర్, టోలీచౌక్, చార్మినార్, ఫిలింగన గర్‌ బస్తీ, బేగంపేట, నార్ముల్, నాచారం, కొత్తపేట, పీఅండ్‌టీ కాలనీ, అంబర్‌పేట ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

ఇక జిల్లాల్లో వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో సుబేదారి, ఈద్గా, కుమా ర్‌పల్లి, జులైవాడ, మండిబజార్, పోచంమైదాన్, చార్‌బౌలి, కాశీబుగ్గ, గణేష్‌నగర్, నిజాంపుర, లక్ష్మీపురం, రంగంపేట, శాంబునిపేట, బాపూ జీనగర్, చింతగట్టుక్యాంప్‌లను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. 

వీటినే నో మూవ్‌మెంట్‌ జోన్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని కొన్నికాలనీల్లో ఇంటింటి సర్వే చేయనున్నారు. నిజామాబాద్‌లో ఆర్యానగర్, మాలపల్లి, ఖిల్లారో డ్‌లను హాట్‌స్పాట్లుగా గుర్తించినట్టు సమాచారం.

 ఇక తక్కువ కేసులున్న ప్రాంతాల్లో పాజిటివ్‌ వ్యక్తులున్న ఇళ్లకు  మూడు  కిలోమీటర మేర హాట్‌ స్పాట్‌గా ప్రకటించి కంటైన్మెంట్‌ ప్రణాళికను అమలు చేయనున్నట్టు తెలిసింది. ఈ ఏరియాల్లో ఇంటింటికి వెళ్లి లక్షణాలున్న వారికి ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేయనున్నారు.