లాక్‌డౌన్‌  తర్వాత రెడ్‌ జోన్‌ ప్రాంతాలపై దృష్టి

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు అమలులో ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో మార్గదర్శకాలను కొనసాగించాల్సిందేనని అధికారులను ఆదేశించారు. 

లాక్‌డౌన్‌ను ఈ నెల 14వ తేదీ తర్వాత కొనసాగించడమా.. విడతల వారీగా సడలించడమా.. లేదా పూర్తిగా ఎత్తివేయడమా అనే అంశాలపై కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయడానికి సన్నద్ధం కావాలని ప్రభుత్వ యంత్రాంగానికి సూచించారు. కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యాచరణను అమలులోకి తీసుకురావాలని చెప్పారు. 

కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఆస్పత్రిలోనూ ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా లక్షణాలతో ఏ రోగి వచ్చినా ముందస్తు జాగ్రత్తగా ఐసొలేషన్‌ వార్డులోనే చికిత్స అందించాలని సీఎం స్పష్టం చేసారు. వైద్యులు, సిబ్బంది కూడా అన్ని రకాల రక్షణ చర్యలు పాటిస్తూ చికిత్స అందించాలని సూచించారు. 

తక్షణమే పరీక్షలు నిర్వహించి, యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలు అందించాలని నిర్దేశించారు. ఢిల్లీలో మర్కజ్‌ సమావేశానికి హాజరైనవారు, వారితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆ తర్వాత సెకండరీ కాంటాక్టులపై ఫోకస్‌ పెట్టాలని చెప్పారు. 

ఇప్పుడున్న ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిపై నిరంతర సర్వే జరుగుతూనే ఉండాలని స్పష్టం చేశారు. ఇతరత్రా వ్యూహాలను అనుసరిస్తూనే ర్యాండమ్‌ చెక్‌పలకు సిద్ధమవ్వాలని సూచించారు. 

కాగా, ఇప్పటికే ఏడు చోట్ల ల్యాబ్‌లు ఉన్నాయని..విశాఖ, విజయవాడ సహా మూడు చోట్ల ల్యాబ్‌ల సామర్థ్యం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు వివరించారు. విశాఖలో రెడ్‌ జోన్లను 8 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌ నుంచి 20 నమూనాలు తీసుకుని పరీక్షించామని అధికారులు చెప్పగా, ఇది మరింత పకడ్బందీగా జరగాలని సీఎం ఆదేశించారు. కేటగిరీల వారీగా నమూనాలు పరీక్షిస్తూ ఉండాలని సూచించారు.