సూర్యుడివైపు దూసుకెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్

మానవ చరిత్రలోనే మొదటిసారిగా సూర్యుడి సమీపంలోకి వెళ్లి పరిశోధనలు చేయగలిగే వ్యోమనౌక(ప్రోబ్)ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. డెల్టా-4 భారీ రాకెట్ ఈ ప్రోబ్‌ను నింగిలోకి మోసుకెళ్లింది. ఫ్లోరిడాలోని కేప్ కానవేరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఉన్న స్పేస్ లాంచ్ కాంప్లెక్స్-37 నుంచి భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:01 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 3:31 గంటలు) డెల్టా-4 నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రయోగాన్ని శనివారం నిర్వహించాల్సి ఉన్నా చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆదివారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

సూర్యుడి చుట్టూ ఉండే ఉష్ణవలయం కరోనాలోకి ప్రవేశించి, సూర్యుడి వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. పార్కర్ ఇచ్చే సమాచారంతో సూర్యుడి నుంచి సౌర పవనాలు ఎలా వెలువడుతున్నాయి? వాటి తీవ్రత ఎంత? వాటి వల్ల భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, వ్యోమగాములు, భూమిపై ఉన్న కమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థలకు ఎలాంటి నష్టం కలుగుతుంది? వంటి అంశాలను అంచనా వేయవచ్చని నాసా చెబుతున్నది. శాస్త్రవేత్తల ఆరు దశాబ్దాల కలకు, లక్షల పనిగంటల శ్రమకు ఈ ప్రయోగం ఒక ఉత్తమ ప్రతిఫలంగా నిలిచిందని చెబుతున్నారు.

ఈ మిషన్ మొత్తం ఏడేండ్లపాటు కొనసాగనున్నది. సూర్యుడి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండటం వల్ల వ్యోమనౌకను నేరుగా సూర్యుడి వద్దకు పంపడం లేదు. ప్రోబ్ ముందుగా శుక్ర గ్రహం సమీపంలోకి పంపుతారు. కక్ష్యలోకి చేరిన తర్వాత ఇంధనాన్ని మండించి సూర్యుడి వైపు మళ్లిస్తారు. ఏడేండ్ల ప్రయాణంలో పార్కర్ ప్రోబ్ మొత్తం 24 సార్లు సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. నవంబర్ మొదటివారంలో శుక్రుడు-సూర్యుడిని చుట్టే మొదటి భ్రమణం ప్రారంభం అవుతుంది.

తొలి భ్రమణంలో పార్కర్ సూర్యుడికి 15 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి వెళ్తుంది. అక్కడి నుంచే కరోనా ప్రారంభం అవుతుంది. పార్కర్ ప్రయాణంలో అత్యధికంగా సూర్యుడికి 38 లక్షల కిలోమీటర్ల సమీపానికి వెళ్తుంది. ఆ సమయంలో పార్కర్ గంటకు ఏడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇదో రికార్డు.