వచ్చే రెండు వారాలు అమెరికాకు గడ్డుకాలం 

వచ్చే రెండు వారాలు అమెరికా అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొనబోతున్నదని, ఈ గడ్డుకాలన్ని అధిగమించేందుకు ప్రజలు సిద్ధమవ్వాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. కరోనా కాటుకు రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో మరణాలు సంభవిస్తాయని  తెలిపారు. 

అమెరికాలో కరో నా బారిన పడిన వారి సంఖ్య 3.20 లక్షలు దాటింది. 9100 మందికిపైగా మృత్యువాతపడ్డారు.  ఈ నేపథ్యంలో శనివారం శ్వేతసౌధంలో ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. ‘అమెరికా అత్యంత గడ్డుకాలాన్ని చవిచూడబోతున్నది. భారీగా ప్రాణనష్టం జరుగువచ్చు"అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

అయితే అమెరికా ఎన్నటికీ షట్‌డౌన్‌ కాకూడదని ట్రంప్ స్పష్టం చేశారు. దేశాన్ని ధ్వంసం కానివ్వబోం. సమస్య కంటే చికిత్స మరింత దిగజార్చేలా ఉండకూడదని పేర్కొన్నారు. తాను ముందు నుంచీ ఇదే చెబుతున్నానని గుర్తు చేశారు. 

మరోవంక,  కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న న్యూయార్క్‌ను ఆదుకొనేందుకు చైనా ముందుకొచ్చింది. విజ్ఞప్తిచేసిందే తడవుగా చైనా తమకు వెంటిలేటర్లు పంపినట్టు న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో శ వెల్లడించారు. చైనా నుంచి 1,000, ఒరెగాన్‌ రాష్ట్రం నుంచి 140 వెంటిలేటర్లు అందినట్టు ఆయన తెలిపారు. 

17 వేల వెంటిలేటర్లను సరఫరా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామని, అయితే ప్రభుత్వం వద్ద 10 వేల వెంటిలేటర్లు మాత్రమే ఉండటంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో ఎగుమతి చేయాల్సిందిగా చైనాను కోరినట్టు ఆయన తెలిపారు. 

వైర‌స్ ఇప్ప‌టివ‌ర‌కు మ‌నుషులకు మాత్ర‌మే పరిమితం కాగా, అమెరికాలో మొదటగా ఒక జంతువుకు సోకింది. బ్రోంక్స్ జూలో నాలుగేళ్ల మ‌ల‌య‌న్ ఆడ‌పులికి క‌రోనా సోకిన‌ట్లు యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్ నేష‌న‌ల్ వెట‌ర్నరీ లాబ‌రేట‌రీస్ స‌ర్వీసెస్ టీం నిర్దారించింది. జూలో జంతువుల ఆల‌నాపాల‌నా చూసుకునే  ఓ ఉద్యోగి (క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలున్న వ్య‌క్తి) పులికి క‌రోనా సోకిన‌ట్లు బోంక్స్ జూ తెలిపింది.