మోడీని హైడ్రాక్సీక్లోరోక్విన్  కోరిన ట్రంప్ 

యాంటీ మలేరియా మందుబిల్ల‌లు హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం అమెరికా ఎదురుచూస్తున్న‌ది.  త‌మ‌కు ఆ మాత్ర‌లు కావాలంటూ అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ ను కోరారు.  ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయ‌న‌.. కోవిడ్‌ను అరిక‌ట్టేందుకు త‌మ‌కు హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్ర‌గ్ అవ‌స‌ర‌మ‌ని ట్రంప్ పేర్కొన్నారు.  

 అమెరికా ఆర్డర్ చేసిన వరకైనా పంపాలని మోదీకి చెప్పారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా భారత్ నుంచి విదేశాలకు ఎగుమతులను, భారత్‌కు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.  అయితే అమెరికాలో క‌రోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. 

దీన్ని అరిక‌ట్టేందుకు మ‌లేరియా డ్ర‌గ్ కొంత వ‌ర‌కు ప‌నిచేస్తుంద‌ని అమెరికా విశ్వ‌సిస్తున్న‌ది. కొన్ని ద‌శాబ్ధాల క్రితం త‌యారు చేసిన హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుతో క‌రోనాను క‌ట్ట‌డి చేయాల‌ని అమెరికా భావిస్తున్న‌ది.  క్లినికల్‌గా ఇంకా రుజువు కాకపోయినా కోవిడ్‌-19 వైరస్‌ నివారణకు ఇది బాగా ఉపయోగపడుతోందని వైద్యులు చెబుతున్నారు.

కరోనా వైరస్‌ నివారణకు ప్రివెంటివ్‌ ఔషధంగా హైడ్రాక్సిక్లోరోక్విన్‌ వాడకాన్ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఇప్పటికే అనుమతించింది.  యాంటీ మ‌లేరియా డ్ర‌గ్‌తో మంచి ఫ‌లితాలే వ‌స్తున్నాయ‌ని ట్రంప్ పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. భారత్  భారీ మొత్తంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్ర‌గ్‌ను రిలీజ్ చేస్తుంద‌ని ఆశిస్తున్నాని, ఒక‌వేళ భార‌త్ అలా చేస్తే ఎంతో రుణ‌ప‌డి ఉంటామ‌ని ట్రంప్ చెప్పిన్నట్లు తెలిసింది. 

 అమెరికాలో నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల 8,400 మందికి పైగా  మ‌ర‌ణించారు. ఒక్క న్యూయార్క్‌లోనే 3500 మంది ప్రాణాలు కోల్పోయారు.  రానున్న రెండు వారాల్లో మ‌ర‌ణాల రేటు మ‌రింత అధికంగా ఉండే ప్ర‌మాదం ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్ర‌గ్ కావాలంటూ భార‌త్‌ను ట్రంప్ ఆశ్ర‌యించ‌డం విశేషం.