10 రోజుల్లో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట  

రానున్న 10 రోజుల్లో దేశంలో  వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమన్న నమ్మకాన్ని ప్రధాన మంత్రి మోదీ ఏర్పర్చిన సాధికారిక బృందం అధికారులు భరోసా వ్యక్తం చేస్తున్నారు.  దేశంలో కరోనా వైరస్‌ అదుపులోనే ఉందని, తబ్లిగీ జమాత్‌ సమావేశాల వంటి ఒకట్రెండు అనుకోని పరిణామాలు జరిగినా పరిస్థితి చేయిదాటి పోలేదని వారు ప్రధానికి నివేదించినట్లు తెలిసింది. 

మోదీ ఈ బృందాల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. దేశంలో ఏమూల వైరస్‌ సమాచారం లభించినా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. మాస్కులు, గ్లోవ్స్‌, వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు (పీపీఈ), వెంటిలేటర్లు, అత్యవసర మందులు.. మొదలైనవన్నీ దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు, ఐసోలేషన్‌ కేంద్రాల్లో సిద్ధంగా ఉండేట్లు చూడాలని ప్రధాని వారిని ఆదేశించారు. సరిపడకపోతే వాటి ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

ఆస్పత్రులు, క్వారంటైన్‌ సెంటర్లు, ఐసీయూలు, ఐసోలేషన్‌ కేంద్రాల్లో పరిస్థితి, కొత్తగా ఎన్ని అవసర మవుతాయి, వాటిలో యుద్ధ ప్రాతిపదికన ఏమేం ఏర్పాటు చేయాలి.. మొదలైన వాటిపై ఆయన సమీక్షించారు. వ్యాధి విస్తరణపై నిఘా, సోకినవారికి అందుతున్న సాయం, పరీక్షలు, క్రిటికల్‌ కేర్‌ ట్రైనింగ్‌ మొదలైనవన్నీ నిరంతరం ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాగాలని ప్రధాని స్పష్టం చేశారు. 

కోవిడ్‌-19కు సంబంధించి విపత్తు యాజమాన్య చట్టం క్రింద కలిసికట్టుగా చర్యలు తీసుకునేందుకు ప్రధాని గత  నెల 29న 11 కీలక సాధికారిక బృందాలను ఏర్పాటు చేశారు. సకాలంలో అమలు చేయడానికి ప్రణాళికలను రూపొందించి తగిన చర్యలు తీసుకునే అధికారాన్ని వీటికి కల్పించారు.

లాక్‌డౌన్‌ సమయం లో చర్యలతో పాటు ఎత్తేశాక కూడా ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా అన్నీ సమృద్ధిగా ఉండేట్లు చూడడం వీటి లక్ష్యం. కాగా, కీలక వైద్య ఉపకరణాల ఎగుమతిపై కేంద్రం నియంత్రణ విధించింది. డయాగ్నస్టిక్‌ కిట్స్‌, ప్రయోగశాలల్లో వాడే సామగ్రిని ఎగుమతి చేయడానికి వీల్లేదని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ తెలిపింది.  

కాగా, ఈనెల 8వ తేదీ ఉదయం 11గంటలకు మోదీ అన్ని పార్టీల పార్లమెంటరీ విభాగాల నేతలతో సమావేశమై కొవిడ్‌-19 కట్టడికి తీసుకుంటున్న చర్యలు వివరిస్తారు. వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు. ‘ఐదుగురు సభ్యులున్న ప్రతీపార్టీ నేతను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలుస్తారు. లాక్‌డౌన్‌ తర్వాత ఆయన విపక్ష నేతలను కలవడం ఇదే ప్రథమం’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు.