వారం రోజులుగా కరోనా మూలాలన్నీ మర్కజ్‌  నుంచే  

ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్‌ మత ప్రార్థనలు దేశ వ్యాప్తంగా ఇంకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల మూలాలన్నీ మర్కజ్‌ నుంచే ఉన్నట్లు వైద్యాధికారులు భావిస్తున్నారు. 

శనివారం నాటికి కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించిన వివరాల ప్రకారం.. మర్కజ్‌ మత ప్రార్థనలకు వెళ్లిన వారు 17 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు నివేదికను తయారు చేశారు. మర్కజ్‌కు సంబంధించి ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో 1023 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 

అలాగే మత ప్రార్థనలకు వెళ్లి  వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయిన సుమారు 22వేల మందిని క్వారెంటైన్‌ కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 30 శాతానికిపైగా ఢిల్లీ వెళ్లొచ్చిన వారికి సంబంధించినవే అని కేంద్రం వెల్లడించింది. ఢిల్లీ బాధిత రాష్ట్రాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, కేరళతో పాటు తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉన్నట్లు తెలిపింది.

కరోనా నిర్థారిత కేసుల్లో 30 శాతం వరకు ఒక ప్రాంతానికి సంబంధించినవే కాబట్టి, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.