కర్ణాటకలో వెంటిలేటర్‌పై ఎవ్వరు లేరు 

కర్ణాటకలో కరోనా వైరస్ అదుపులో ఉన్నదని, ప్రాస్తుతం రాష్ట్రంలో వెంటిలేటర్ పై ఎవ్వరు లేరని ముఖ్యమంత్రి బి ఎస్ యడియూరప్ప భరోసా ఇచ్చారు.  128మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యిందన్నారు. వీరిలో ఇరువురికి మాత్రమే ఆక్సిజన్‌ అమర్చామన్నారు. ఇప్పటివరకు నలుగురు మృతి చెందారని, 11మంది కోలుకున్నారని చెప్పారు. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలకు అనుగుణంగా లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అ మలు చేస్తున్నామని తెలిపారు. ఇళ్ళనుంచి ఎవరూ రోడ్లపైకి రావద్దని కోరుతూ  వైరస్‌ సోకే అవకాశాలు అధికమని ముఖ్యమంత్రి యెచ్చరించారు. కరోనా నియంత్రణకు ఏకైక మార్గం అని స్పష్టం చేస్తూ  ప్రతి ఒక్కరూ ఇళ్ళల్లో ఉండడమే మేలని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో రేషన్‌కార్డులు లేకున్నా నిత్యావసరాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్ఛారు. ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదని అధికారులకు స్పష్టమైన సూచన చేశానని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఆహారం సమకూర్చే దిశగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఎంతోమంది దాతలు, పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారని అంటూ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

కరోనా నియంత్రణకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు సహకరించాలని కోరుతూ  ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. వైరస్‌ నియంత్రణకోసం తీసుకున్న చర్యలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. 

ఢిల్లీ ధార్మిక సదస్సుకు వెళ్ళి వచ్చినవారిలో వైరస్‌ ప్రబలుతోందని అందుకే వారందరికీ క్వారంటైన్‌కు తరలించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ విషయమై మైనారిటీ ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశామని చెప్పారు. వలస కార్మికులకు అవసరమైన సౌలభ్యాలు సమకూరుస్తున్నాని పేర్కొన్నారు. వారిలో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రులకు తరలిస్తున్నామని తెలిపారు. 

బెంగళూరులో 30కు పైగా ఫీవర్‌ క్లినిక్‌లు పనిచేస్తున్నాయని, రోజూ వందలాదిమంది పరీక్షలు చేయించుకుంటున్నారని చెప్పారు.  రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ఉందని మరిన్ని రోజులు ప్రజల సహకారంతో సంపూర్ణంగా తరిమికొడతామని విశ్వాసం వ్యక్తం చేసారు.