ఏపీలో గాలికి వదిలేస్తున్న `సామాజిక దూరం' 

కరోనా కట్టడికి `సామజిక దూరం'  పాటించడమే ఏకైక మార్గం అని ప్రధాని నరేంద్ర మోదీ నుండి అండూ స్పష్టం చేస్తున్నారు. మూడు వరాల లాక్ డౌన్ ప్రకటించడం కూడా ప్రాధమికంగా ప్రజలు `సామాజిక దూరం'  పాటించే విధంగా చేయడం కోసమే. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పధకాల అమలులోనే `సామాజిక దూరం'  పాటిస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు శ్రద్ద తీసుకొవడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి. 

లాక్‌డౌన్‌ కారణంగా తెల్లరేషన్‌ కార్డు కలిగిన పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతో  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 ఆర్ధిక సహాయాన్ని బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేయకుండా గ్రామాలలో వైసిపి కార్యకర్తలు ఎన్నికల ప్రచార రీతిలో పంపిణి చేస్తున్నారు. 

ఈ సందర్భంగా కూడా `సామాజిక దూరం' ను పాటించడం లేదు. గ్రామా వాలంటీర్లు పంపిణి చేయవలసి ఉండగా, వారి వద్ద నుండి స్థానిక వైసిపి కార్యకర్తలు తీసుకొని, పార్టీ ప్రచార కార్యక్రమం వలే ఈ పంపిణి జరుపుతున్నారు. 

మరోవంక, జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (ఎఎన్‌ఎం), జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (జిఎన్‌ఎం) పోస్టుల దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా  స్వయంగా వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ సందర్భంగా `సామాజిక దూరం' పాటించక పోవడంతో అభ్యర్థులు ఆందోళనలకు గురి కావాల్సి వచ్చింది.

కరోనా నేపథ్యంలో ఎఎన్‌ఎం, జిఎన్‌ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతూ ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో, దరఖాస్తు చేసుకొనేందుకు ఒంగోలు కలెక్టరేట్‌లోని డిఎం అండ్‌ హెచ్‌ఒ కార్యాలయానికి శనివారం సుమారు 250 మంది మహిళలు వచ్చారు. అభ్యర్థులు భౌతిక దూరం పాటించేలా, ఇతర జాగ్రత్తల విషయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేదు. 

దీంతో, ఒక్కసారిగా వచ్చిన మహిళల అభ్యర్థులు కార్యాలయం వద్ద గుంపులు గుంపులుగా చేరారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, కరోనా నివారణ నిబంధనలు అమలు కాని పరిస్థితి నెలకొందని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 

అయితే ఈ విషయం తెలుసుకొని పోలీసులు వచ్చి వారిని వరుసలో, దూరం - దూరంగా నిలబెట్టారు.  కరోనా సమయంలో అత్యంత బాధ్యతగా వ్యవహరించాల్సిన శాఖే బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం పట్ల విమర్శలకు తావిచ్చింది.