యుక్త వ‌య‌స్కులే ఎక్కువ‌గా కరోనా బాధితులు  

ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న‌కరోనా మహమ్మారికి  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏడు  ల‌క్ష‌ల మందికి పైగా గురు కాగా, 70  వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మ‌న‌దేశంలో ఇప్పటివరకు 3,619 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది మృతి చెందారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిస్థితి ఎలా ఉన్నా.. మ‌న దేశంలో మాత్రం యుక్త వ‌య‌స్కులే ఎక్కువ‌గా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. అయితే మ‌ర‌ణాల్లో మాత్రం వృద్ధుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ది. 

ఈ గ‌ణాంకాల‌ను స్వ‌యంగా కేంద్ర‌ప్ర‌భుత్వ వ‌ర్గాలే వెల్ల‌డించాయి. దేశంలో న‌మోదైన మొత్తం మూడు వేల పై చిలుకు క‌రోనా కేసుల్లో 60 ఏండ్ల లోపువారే 83 శాతం మంది ఉన్నారు. ఆ 83 శాతం మందిలోనూ 21 నుంచి 40 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సు వారే ఎక్కువ‌గా ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు. క‌రోనా బారిన‌ప‌డ్డ వారిలో వృద్ధులు అంటే 60 ఏండ్లు ఆ పైన వ‌య‌సు క‌లిగిన వారు కేవ‌లం 17 శాతం మందే ఉన్నారు. 

దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల్లో ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చిన వారే ఎక్కువ‌గా ఉన్నార‌ని, చదువు కోసం. ఉద్యోగాల కోసం ఇత‌ర దేశాల‌కు వెళ్లిన వారిలో ఎక్కువ మంది 21 నుంచి 40 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సు వారేన‌ని, అందుకే క‌రోనా బాధితుల్లో ఎక్కువ‌గా ఆ వ‌య‌సు వారు ఉంటున్నార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వ‌ర్గాలు తెలిపాయి. 

అయితే, క‌రోనా బాధితుల కోణంలో చూసిన‌ప్పుడు వృద్ధుల సంఖ్య త‌క్కువ‌గానే ఉన్నా.. మ‌ర‌ణించిన వారిలో మాత్రం 60 ఏండ్లకు పైబ‌డిన వారే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు.