మతపర సమావేశాలకు దూరంగా ఉండండి 

కరోనా వైరస్‌ మానవాళికి పెద్ద ప్రమాదంగా పరిణమించడంతో  మత పరమైన సదస్సులు, సమావేశాలు మంచిది కాదని, ఆ మేరకు మత పెద్దలు ప్రజలకు తగిన సూచనలు చేయాలని మత పెద్దలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు. సాధారణంగా మత పరమైన కార్యక్రమాల వల్ల సమూహాలు ఏర్పడతాయని చెబుతూ తాజా పరిస్ధితులలో ఇది ఎంతమాత్రం అంగీకార యోగ్యం కాదని స్పష్టం చేశారు. 

మానవాళి మనుగడ కోసం చేపడుతున్న లాక్ డౌన్ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు తనదిగా భావించినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని  గవర్నర్ తెలిపారు..  కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సామాజిక దూరమే కీలకం కావునా ప్రతి ఒక్కరూ తదనుగుణంగా వ్యవహరించడమే కాకుండా... మరికొందరికి సామాజిక దూరం ఆవశ్యకతను సామాజిక మాధ్యమాల ద్వారా వివరించాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు. చివరి రోజు వరకు ఎటువంటి వెసులు బాటు లేకుండా దీనిని పూర్తి చేయాలని కోరారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను తూచా తప్పకుండా పాటించటమే దేశ పౌరులుగా సమాజానికి చేయగలిగన సేవ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తిని నివారించే క్రమంలో వైద్య సేవలోన నిమగ్నమై ఉన్న సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కొన్ని ప్రాంతాలలో వైద్య ఆరోగ్య సిబ్బంది విధులను అడ్డుకోవటం వంటివి చేస్తున్నారన్న సమాచారం పట్ల ఆందోళణ వ్యక్తం చేశారు. ఈ తరహా పరిస్ధితులు ఏమాత్రం వాంఛనీయం కాదని ఆయన స్పష్టం చేసారు. 

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు తీసుకుంఉటన్న చర్యలను ప్రోత్సహించేలా సమాజం వ్యవహరించాలని గవర్నర్ హితవు చెప్పారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. కృతనిశ్చయం, సంయమనం ప్రాతిపదికన కరోనా వైరస్కు చరమగీతం పాడాలన్న ప్రధాని పిలుపుకు  లభిస్తున్న స్పందన అపూర్వమైందని పేర్కొన్నారు. 

కరోనా అతి వేగంగా విస్తరిస్తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తుండగా, లాక్‌డౌన్‌ కాలపరిమితి ముగిసే వరకు ఎవరూ బయటకు రాకండా ఇంటి వద్దే ఉండాలని హితవు చెప్పారు. ఇక అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా వ్యాప్తి గొలుసును అధికమించగలమని ఆయన చెప్పారు. స్వచ్ఛంధ సంస్ధలతో పాటు రెడ్ క్రాస్, ఎన్ సిసి, స్కౌట్స్, గైడ్స్, ఎన్ఎస్ఎస్ వంటి వ్యవస్ధలు కీలక బాధ్యతలు నిర్వర్తించటం ముదావహమని చెప్పారు. 

ఆయా సీజన్ల మేరకు జరగాల్సిన వ్యవసాయపనులను వాయిదా వేయలేమని, ఈ పరిస్ధితిలో వారికి ప్రభుత్వం అందించిన మినహాయింపును అత్యంత జాగ్రతగా వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయ పనులలో సైతం భౌతిక దూరం అవసరమని చెబుతూ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.