రండి.. తిరిగి దీపాలను వెలిగిద్దాం... 

కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఆదివారం ప్రజలందరూ తమ తమ ఇళ్లల్లోని విద్యుత్ లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చిన విషయం విదితమే. అయితే దీనికి సంబంధించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కవితా గానాన్ని ప్రధాని మోదీ శనివారం రోజు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు... ఆ కవిత ఇదే...

‘‘రండి.. తిరిగి దీపాలను వెలిగిద్దాం...

పట్టపగలే చిమ్మ చీకటి

నీడ చేతిలో ఓడిన సూరీడు

అంతరాళల్లోని ప్రేమను పిండుకుందాం...

ఆరిన వత్తిని వెలిగిద్దాం...

రండి... తిరిగి దీపాలను వెలిగిద్దాం..

 

మజిలి యే మన గమ్యంగా భావిద్దాం...

కన్నుల నుండి లక్ష్యం దాగి ఉన్నది

వర్తమాన మోహపు వలలో పడి

రేపటి భవిష్యత్తు మరవద్దు...

రండి తిరిగి దీపాలను వెలిగిద్దాం...

 

అసంపూర్తి యజ్ఞంలో ఆహుతులు మిగులు

మన వారిని చుట్టు ముట్టిన విఘ్నాలు

అంతిమ విజయపు ‘వజ్ర’ నిమిత్తం

నూతన దధీచుల అస్తికల కరిగిద్దాం

రండి... తిరిగి దీపాలను వెలిగిద్దాం...’’

అన్న మాజీ ప్రధాని వాజపేయి కవితా పంక్తులను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 

ఏప్రిల్‌ 5వ తేదీన అంటే ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో  9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లవద్దనే ఉండి ఇళ్లల్లోని విద్యుత్‌ లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించి, తమ ధృఢ సంకల్పాన్ని వెల్లడించాలి. 

చమురు దీపాలు లేదా కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు లేదా సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్లు... ఏవి వీలైతే అవి వెలిగించి, కరోనా అనే చీకటిని, ఆ మహమ్మారిని తరిమేద్దాం అనే సంకల్పం తీసుకోవాలి. నా కోసం మీ విలువైన సమయంలో ఓ 9 నిమిషాలు కేటాయించండి. జనతా స్ఫూర్తిని మరోమారు చాటండి’ అని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.