ఢిల్లీ మసీదుల్లో 600 మంది విదేశీయులు 

మసీదుల్లో దాక్కున్న విదేశీయుల గురించి ఢిల్లీ సర్కారుకు పోలీసులు అత్యవసర సందేశం పంపించారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ తబ్లీగ్ జమాత్ సదస్సు కోసం వచ్చిన 600 మంది విదేశీయులు పలు మసీదుల్లో దాక్కున్నారని, కరోనా వైరస్ ప్రబలకుండా వారిని పట్టుకొని క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు అనుమతించాలని ఢిల్లీ పోలీసులు  ప్రభుత్వాన్ని కోరారు. 

ఢిల్లీలోని తబ్లిగ్ జమాత్ ప్రధాన కార్యాలయం నుంచి పోలీసులు ఇప్పటికే 2,300 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. మర్కజ్ మత సమ్మేళన సమావేశానికి హాజరైన 600 మంది విదేశీయులు ఢిల్లీ నగర శివార్లలోని 16 మసీదుల్లో దాక్కున్నారని, వారి జాడను కనుగొనేందుకు ఆరోగ్యశాఖ కార్యకర్తలు, పౌరసేవకులు, పోలీసులతో కలిసి బృందాలు ఏర్పాటు చేసి మసీదుల్లో తనిఖీలు జరిపేందుకు అనుమతించాలని ఢిల్లీ పోలీసులు సర్కారును అభ్యర్థించారు.

మసీదుల్లో దాక్కున్న తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు, విదేశీయులకు కరోనా వైరస్ ప్రబలి ఉంటుందని, వారి ద్వార చాలామందికి ఈ వైరస్ సోకి ఉంటుందని వైద్యఆరోగ్యశాఖ అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఈశాన్య జిల్లాలోని మసీదుల్లో 100 మంది, ఆగ్నేయ జిల్లాలో 200 మంది, దక్షిణ జిల్లాలో 170 మంది, పశ్చిమజిల్లాలో ఏడుగురు విదేశీయులున్నారని భద్రతా సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 

కరోనా వైరస్ అతిపెద్ద హాట్ స్పాట్ గా నిజాముద్దీన్ మర్కజ్ మారడంతో వివిధ మసీదుల్లో మకాం వేసి ఉన్న విదేశీయులు, జమాత్ కార్యకర్తలను గుర్తించి వారిని పట్టుకొని క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు ఢిల్లీ పోలీసులు సమాయత్తమయ్యారు. దీనిలో భాగంగానే 16 మసీదులపై పోలీసులు వైద్యశాఖ కార్యకర్తలతో కలిసి దాడులు చేయాలని నిర్ణయించారు.