కోహ్లీ లాగా పోరాట స్ఫూర్తిని కనబరుద్దాం  

కరోనాపై యుద్ధంలో  గెలిచేందుకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లాగా పోరాట స్ఫూర్తిని కనబరుద్దామని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రమాదకర కరోనా వైరస్‌పై సమిష్టిగా పోరాడుదామని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంలో క్రీడాకారులందరూ మద్దతు కావాలని కోరారు. 

ప్రమాదకర కరోనా వైరస్‌పై  పోరాటంలో మద్దతు కోరుతూ  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశంలోని ప్రముఖ క్రీడాకారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా  సలహాలు, సూచనలు చేస్తూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

రోజురోజుకు వైరస్‌ ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు క్రీడాకారులు తమ వంతు పాత్ర పోషించాలని ప్రధాని సూచించారు.   తెలుగు యువ షట్లర్‌ సాయి ప్రణీత్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన వీడియోను మిగతా అథ్లెట్లతో కలిసి మోదీ పంచుకున్నారు. ‘మీ అభిప్రాయాలన్నింటినీ కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

"మీరంతా ఐదు సూత్రాలతో ప్రజల్లోకి వెళ్లండి. మహమ్మారిపై పోరాడాలనే ‘సంక ల్పం’, నిర్ణీత దూరం పాటించేలా ‘నిగ్రహం’, సానుకూల ధోరణితో ఉండాలనే  ‘అనుకూలత’, కరోనాపై పోరాటంలో ముందున్న వైద్య, పోలీస్‌, పారిశుధ్య సిబ్బంది పట్ల ‘గౌరవం’, పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళాల ద్వారా ‘సహాయం’ ప్రదర్శించాలి" అంటూ పిలుపిచ్చారు. 

భారత్‌లో క్రీడాకారులకు ఉన్న ఆదరణ మరేవరికీ లేదని, మీరిచ్చే సలహాలు, సూచనలు వారిపై కచ్చితంగా ప్రభావం చూపుతాయనే నమ్మకాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. అసాధారణ ఆటతో భారత ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిన మీరు కరోనాపై ప్రజలను చైతన్య వంతులు చేసేందుకు నడుం బిగించాల్సిన అవసరం అసన్నమైందని సూచించారు. 

ఈ కార్యక్రమంలో దిగ్గజ క్రికెటర్లు సచిన్‌, గంగూలీతో పాటు యువరాజ్‌సింగ్‌, జహీర్‌ఖాన్‌, కోహ్లీ, రోహిత్‌శర్మ, పీవీ సింధు, సాయి ప్రణీత్‌, నీరజ్‌ చోప్రా, ఆనంద్‌, హిమాదాస్‌, అమిత్‌ పంగల్‌, వినేశ్‌ ఫోగట్‌, మను భాకర్‌, అజయ్‌ ఠాకూర్‌,  అంకితా రైనా తదితరులు పాల్గొన్నారు.