ఫసల్ బీమా యోజన కింద రూ.10 వేల కోట్లు

కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా పండించిన వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకోలేక, కొత్తగా అప్పులు పుట్టక అవస్థలను పడుతున్న రైతలను ఆదుకోవడం కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) కింద నెల 20 నాటికి రైతులకు రూ.10,000 కోట్ల విలువైన సహాయక ప్యాకేజిని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి రైతులకు ఈ సొమ్మును ముందుగానే విడుదల చేయాలని మోడీ ప్రభుత్వ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ పథకం కింద బీమా సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లోకి జమచేస్తారు. 

గత ఏడాది చివర్లో భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడం, ఇప్పుడు 21 రోజుల లాక్‌డౌన్ కారణంగా రైతులు రబీ పంటలను కోసే స్థితి కానీ, ఇంటికి తీసుకు వచ్చిన పంటను అమ్ముకునే పరిస్థితి కానీ లేని కారణంగా దేశ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పంటల బీమా తుది మొత్తాన్ని లెక్కించే ప్రక్రియ చివరి దశలో ఉందని త్వరలోనే ఈ మొత్తాన్ని రైతులకు అందజేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక తెలిపింది.