కూలీల చేరిక, తబ్లీగ్‌తో కరోనా కట్టడికి గండి

దేశంలో కరోనా నియంత్రణ చర్యలకు ఇప్పుడు ఎదురైన విఘాతం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఆనంద్‌విహార్‌లో వలస కూలీలు భారీగా గుమికూడటం, నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశానికి హాజరైనవారికి వైరస్‌ సోకడంపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తంచేశారు. కొవిడ్‌-19ను అంతమొందించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు ఇవి ఎదురుదెబ్బలని అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, పరిపాలనా నిర్వాహకులతో రాష్ట్రపతి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ తదితర అంశాలను ప్రస్తావించారు. లాక్‌డౌన్‌ సమయంలో దేశంలోని ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు.   

ప్రత్యేకించి ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న రెండు పరిణామాలను రాష్ట్రపతి ప్రస్తావించినట్లు రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడ్డ అధికారిక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయిలో సాగుతోన్న లాక్‌డౌన్‌తో ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతోన్న విషయాన్ని రాష్ట్రపతి అంగీకరించారు.

ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదని, ఇందుకు తగు చర్యలు తీసుకోవాలని, ఇదే సమయంలో వైరస్ వ్యాప్తి కాకుండా చూడాల్సి ఉందని రాష్ట్రపతి సూచించారు. కన్పించని శత్రువు పట్ల ఉదాసీనత, నిర్లక్షం పనికిరాదని ఈ సమావేశం సందర్భంగా అంతా ఏకీభవించారు. 

విధులలో ఉన్న డాక్టర్లు, పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు ఇతర ఘటనల పట్ల రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటివి ఎక్కడా జరగరాదని సూచించారు. ఢిల్లీలోని ఆనంద్‌విహార్‌లో వలసకూలీలు పెద్ద ఎత్తున చేరడం, అదే విధంగా ఢిల్లీలోనే ఉన్న నిజాముద్దీన్‌లో తబ్లీగ్ జమాత్ సదస్సుకు వేలాది మంది తరలిరావడం కరోనా సమయంలో తీవ్ర పరిణామాలు అయ్యాయని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.