తెలంగాణలో ఒకేరోజు 75 పాజిటివ్ కేసులు 

మర్కజ్‌ నుంచి వచ్చిన వారందరిని గుర్తించామని తెలంగాణ  వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. వచ్చిన వారిలో లక్షణాలు ఉన్నవారిని, వారి కుటుంబ సభ్యులకు ఐసోలేషన్‌ సెంటర్స్‌కు తరలించి కరోనా పరీక్షలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

యుద్ధప్రాతిపదికన పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఆరు ల్యాబ్‌లలో 24 గంటలు మూడు షిఫ్టుల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ రోజు షాద్‌నగర్‌కు చెందిన వ్యక్తి, సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి ఇద్దరు మృతి చెందారు. మృతులు ఎవరెవరిని కలిశారో వారి గురించి ఆరా తీస్తున్నామని తెలిపారు. 

రాష్ట్రంలో శుక్రవారం  రోజు 75 పాజిటివ్‌ కేసులు నమోదై మొత్తం రాష్ట్రంలో 229 పాజిటివ్‌ కేసులు నమోదు చేసుకున్నాయి. ఈ రోజు 15 మంది కోలుకున్న కరోనా బాధితులను డిశ్చార్జ్‌ చేసారు.  ఇప్పటి వరకు మొత్తం 32 మంది డిశ్చార్‌ అయ్యారు. 

ఈ రోజు మరో ఇద్దరు మృతి చెందగా, రాష్ట్రంలో కరోనా వల్ల 11 మంది మృతి చెందినట్లు నమోదైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో 186 మంది పాజిటివ్‌ కేసులు చికిత్స తీసుకుంటున్నారని ప్రకటించారు. 

ఇలా ఉండగా, కరోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు  రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5 నెల రాత్రి 9 గంటలకు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

మానవజాతి తనకు పట్టిన పీడపై చేస్తోన్న గొప్ప పోరాటం స్ఫూర్తివంతంగా సాగాలని  సీఎం కేసీఆర్‌  ఆకాంక్షించారు. కరోనాపై యుద్ధంలో భారతీయులంతా గెలుస్తారని ధీమా వ్యక్తం చేయడంతోపాటు మరోసారి దేశ పౌరులంతా కరోనాను తరిమికొట్టేందుకు ఈ ఆదివారం ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.