ట్రేడింగ్ సమయాలను కుదించిన ఆర్బీఐ

కరోనా వైరస్ కారణంగా దేశంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ద్రవ్య, ప్రభుత్వ సెక్యురిటీస్ సహా ఇతర మార్కెట్ల ట్రేడింగ్ సమయాలను భారీగా తగ్గించింది.ఈ నెల 7 నుంచి 17 వరకు ఆర్బీఐ నిర్ణయం అమల్లో ఉంటుంది. 

కాల్‌మనీ మార్కెట్, ప్రభుత్వ సెక్యురిటీస్ మార్కెట్, కరెన్స్ మార్కెట్ సహా అనేక ఇతర మార్కెట్లు ఇప్పటి వరకు ఉదయం 9 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్నాయి. అయితే ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఈ మార్కెట్లన్నీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేస్తాయి.    

‘‘కొవిడ్-19 వ్యాప్తి కారణంగా దేశంలో ఇంతకు ముందెన్నడూ లేని పరిస్థితులు నెలకొన్నాయి. లాక్‌డౌన్లు, సామాజిక దూరం, రవాణాపై ఆంక్షలు తప్పనిసరి అయ్యాయి. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు... వ్యాపార కొనసాగింపు కోసం ప్రత్యేక ప్రణాళికలు వేసుకోవాల్సి వచ్చింది. దీని వల్ల ఆర్థిక మార్కెట్ల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడింది" అని పేర్కొన్నది. 

"ఉద్యోగులు, ఐటీ వనరులు తీవ్రంగా ప్రభావితం కావడంతో పాటు కార్యనిర్వహణ, లాజిస్టిక్ సమస్యలు అధికమయ్యాయి. ఆర్ధిక కార్యకలాపాలు మందగించడం వల్ల మార్కెట్ లిక్విడిటీ దెబ్బతినడంతో పాటు ఆర్ధిక ధరల్లో అస్థిరత పెరుగుతోంది....’’ అని ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఈ రిస్కులను తగ్గించడంతో పాటు మార్కెట్ వర్గాల క్షేమం కోసం ట్రేడింగ్ వేళలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.