ఒవైసీ ఆసుపత్రిని ఐసోలేషన్ వార్డుగా చెయ్యరే!

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా  రోగులకు వైద్య సదుపాయాలు సమకూర్చేందుకు ఎంతో కష్ట పడుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తనకు పొత్తు ఏర్పాటు చేసుకున్న మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాస్పిటల్‌‌ను ఎందుకు ఐసోలేషన్ వార్డుగా మార్చడం లేదో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. 

కనీసం ఒవైసి  హాస్పటల్‌‌లో పని చేసే డాకర్టను కరోనా చికిత్సల కోసం వాడుకోవచ్చు గదా ని సీఎంను ఆయన నిలదీశారు. కరోనా బాధితులుగా ఉన్న వారిలో 99 శాతం మంది ముస్లింలే అయినా వారిని ఆదుకునేందుకు ఒవైసీ ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. 

రాజకీయ ప్రయోజనాలకోసం ముస్లింలను రేచ్ఛగొట్టే నేత వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి రారేమిటని విస్మయం వ్యక్తం చేశారు. ముస్లింలను ఓటు బ్యాంక్ గా వాడుకునే అసద్, ఈ వైరస్‌‌పై ముస్లిం సమాజంలో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని దుయ్యబట్టారు.

దేశంలో కరోనా నియంత్రణకు, ప్రజల్ని కాపాడేందుకు లాక్ డౌన్ అమలు చేస్తూ ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు పొందుతున్న మోడీపై ఒవైసీ రాజకీయ కోణంలో విమర్శలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

గాంధీలో డాక్టర్లపై దాడి జరిగితే మజ్లిస్ నేతలు ఎందుకు స్పందించరని సంజయ్ ప్రశ్నించారు. ఒకవేళ అదే డాక్టర్లు ఈ దాడులకు నిరసనగా డ్యూటీ బాయ్‌‌కాట్ చేస్తే నష్టపోయేదెవరో గుర్తుంచుకోవాలని ఒవైసీకి హితవు చెప్పారు. 

ఢిల్లీలో కరోనా బాధితులు చికిత్సకు సహకరించకుండా డాక్టర్లపై ఉమ్మి వేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌‌లో కరోనా రోగుల గురించి సర్వే చేస్తున్న ఆశా వర్కర్లపైకి కొందరు ఎగతోస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు. 

ఇలాంటి ఘటనలపై అసద్ ఎందుకు స్పందించరని నిలదీశారు. పాజిటివ్ వచ్చిన రోగులపై చికిత్స చేస్తూ తమ ప్రాణాలకు ముప్పు అని తెలిసినా, తమ పిల్లలకు దూరమవుతామన్న భయం.. డాక్టర్లను, నర్సులను వెంటాడుతున్నా.. వృత్తే దైవంగా డాక్టర్లు సేవ చేస్తున్న విషయాన్ని మజ్లిస్ నేతలు గుర్తుంచుకోవాలని కోరారు. 

డాక్టర్లను, నర్సులను విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం కేసీఆర్‌‌ను సంజయ్ డిమాండ్ చేశారు.