ఏపీలో తొలి కరోనా మరణం 

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం విజయవాడలో నమోదయ్యింది. వైరస్‌ సోకి షేక్‌ సుభాని (55) అనే వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మరణించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 

ప్రభుత్వం విడుదల చేసిన మీడియా బులిటెన్‌ ప్రకారం షేక్‌ సుభాని డయాబెటిస్‌ కార్డియాక్‌ ఆరోగ్య సమస్యలతో మార్చి 30న విజయవాడలోని జనరల్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే అతని కుమారుడు ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించిన వైద్యులు.. కుమారుడితో పాటు సుభానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 

ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ మేరకు సుభానికి చికిత్స అందిస్తుండగానే శుక్రవారం మధ్యాహ్నం 12. 30 నిమిషాలకు మృతి చెందారు.   తండ్రి, కుమారుడితో కాంటాక్ట్ అయిన 29 మందిని కూడా క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. మరోవైపు సుభాని కుమారుడు ఢిల్లీ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణించిన వారి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తేలిపే పనిలో ఏపీ అధికారులు నిమగ్నమయ్యారు.  

రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించడంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఆ వ్యక్తి నుంచి ఈ వైరస్ ఎంతమందికి సోకిందో అనే ఆందోళన జనాల్లో నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . శుక్రవారం నాటికి  161కి చేరుకుంది. ఇవాళ నెల్లూరు-8, విశాఖ-3, కడపలో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. 

ఏపీ నుంచి ఢిల్లీ మర్కజ్ కు వెళ్లిన వాళ్లలో 108 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం తేల్చింది. మొత్తంగా ఏపీ నుంచి 1805 మంది నిజాముద్దీన్ కు వెళ్లినట్లు గుర్తించారు. అందులో 881 మందికి పరీక్షలు నిర్వహించగా.. 108 మందికి పాజిటివ్ గా తేలింది.

అంతేకాకుండా జమాతే వెళ్లిన వారికి చెందిన 605 కుటుంబ సభ్యులను పరీక్షించగా.. 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏపీలో మొత్తం 161 కేసులు నమోదుకాగా.. అందులో 140 కేసులు జమాతే వెళ్లి వచ్చిన వారేనని తేలింది.  

నిన్నటి వరకూ కృష్ణా జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవ్వగా.. తాజాగా నెల్లూరు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అత్యధికంగా నెల్లూరులో 32 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత  కృష్ణా జిల్లాలో 23, గుంటూరు 20, కడప 19, ప్రకాశం జిల్లాలో 17 కరోనా కేసులు నమోదయ్యాయి.