ఏపీలో 152కు చేరిన కరోనా కేసులు 

తెలుగు రాష్ట్రాలలో   కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏపీలో గురువారం 41 కేసులు బయటపడ్డాయి. నెల్లూరు అత్యధికంగా 23 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 152కు చేరింది. పరీక్షించిన వాటిల్లో 1321 నెగెటివ్‌గా తేలాయి. 

ఉదయం పదిగంటలకు 21 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నాలుగు గంటలకు మరో మూడు నిర్థారణ అయ్యాయి. ఆరుగంటలకు ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. రాత్రి పదిగంటలకు మరో తొమ్మిది కేసులు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారివిగానే నిర్థారణ అయింది. 

వైద్య సిబ్బందికి అందుబాటులో ఉండేలా ప్రతి జిల్లా ఆస్పత్రికీ వెయ్యి వ్యక్తిగత సంరక్షణ పరికరాల (పిపిఇ)ను సరఫరా చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నాలుగు పరీక్ష కేంద్రాలతోపాటు గుంటూరు, కడపలో మరో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 

ఈ నాలుగు ఆస్పత్రులకు ప్రతిరోజూ 2500 పిపిఇలు సరఫరా చేయాలని తెలిపారు. గుంటూరులోని కరోనా పరీక్ష కేంద్రంలో క్వాలిటీ టెస్టు చేశామని, నేటి నుంచి పరీక్షలు మొదలు పెట్టనున్నామని పేర్కొన్నారు. 

కడపలో నేడు క్వాలిటీ టెస్టు చేసి, రేపటి నుంచి పరీక్షలు మొదలు పెడతామని తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా పరీక్షలు రోజుకు 450 నుంచి 570కి పెరుగుతాయని పేర్కొన్నారు. విశాఖలో మరో పరీక్ష కేంద్రాన్ని సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. 

ఢిల్లీ నిజాముద్దీన్‌ సమావేశానికి రాష్ట్రం నుంచి 1085 మంది హాజరైనట్లు సమాచారం ఉందని, వారిలో 758 మందిని గుర్తించి వారి నమూనాలు పరీక్షించగా 91 మందికి పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లివచ్చిన వారిలో దాదాపు 16శాతం మందికి కరోనా సోకినట్లు తెలిపారు. మిగిలిన వారిని గుర్తించేందుకు అన్ని జిల్లాల అధికారులూ కృషి చేస్తున్నారని తెలిపారు.  

కాగా, తెలంగాణలో గడిచిన రెండ్రోజుల్లో 57 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. గురువారం కొత్తగా 27 మందికి వైరస్ ఉన్నట్టు తేలిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 154కు పెరిగింది. 

ఇందులో 14 మంది ఇప్పటికే వైరస్ నుంచి కోలుకుని ఇంటికెళ్లిపోగా, గురువారం మరో ముగ్గురిని డిశ్చార్జ్ చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఇంకో 128 మంది గాంధీ, కింగ్‌ కోఠి, చెస్ట్‌ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 9 మంది మరణించారు.