భారత్ లో 72కు పెరిగిన మృతుల సంఖ్య

ఇప్పటి వరకు దేశంలో 2552 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 72 మంది చనిపోగా.. 191 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 423 కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఆ తర్వాత  తమిళనాడులో 309, ఢిల్లీ 293, కేరళ 286, తెలంగాణ 154, ఆంధ్రప్రదేశ్ 149, రాజస్థాన్ 140, ఉత్తరప్రదేశ్ 128, కర్ణాటక 124, మధ్యప్రదేశ్ 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

అత్యధికంగా మహారాష్ట్రలో 21 మంది కరోనాతో మరణించారు.  ఆ తర్వాత  తెలంగాణలో 9, మధ్యప్రదేశ్ లో 8, గుజరాత్ లో 7, పశ్చిమబెంగాల్ లో 6 మంది కరోనాతో చనిపోయారు.  

ఢిల్లీలోని తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారి ద్వారా దేశవ్యాప్తంగా 500 మందికిపైగా వైరస్‌ వ్యాపించినట్లు గుర్తించారు.  ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారి గుర్తింపు, నిర్ధారణ పరీక్షలు, వ్యాప్తి నిరోధక చర్యలపై యుద్ధప్రాతిపదికన స్పందించాలని కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి  అన్ని రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులు, డీజీపీలకు సూచించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 

మహారాష్ట్రలో కరోనా కేసులు 400 దాటాయి. కొత్తగా 81 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ సహా తెలంగాణ, తమిళనాడు, ఏపీ,  తదితర రాష్ట్రాల్లో తబ్లిగీ జమాత్‌ ప్రభావం స్పష్టం       కనిపించింది. మరింత మందికి పరీక్షలు నిర్వహిస్తుండటంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశమున్నది. 

రూ. 1.5 కోట్ల విలువైన వ్యక్తిగత రక్షణ పరికరాలకు ఆర్డర్‌ ఇచ్చామని, వీటి సరఫరా మొదలైందని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశీయంగా ఎన్‌-95 మాస్కుల తయారీ ఊపందుకుందని చెప్పా రు. వైద్యుల్లో కొందరికి వైరస్‌ సోకడంతో దవాఖానల్లో వైరస్‌ నియంత్రణ చర్యలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించినట్లు వివరించారు. 

మరోవైపు ఎయిరిండియా విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌హోస్టెస్‌కు కరోనా సోకినట్టు తేలింది. ఆమె గతనెల 20న న్యూయార్క్‌ నుంచి ముంబైకి వచ్చిన విమానంలో సేవలు అందించారు.  ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 

ఢిల్లీకి చెందిన సీఆర్పీఎఫ్‌ వైద్యాధికారికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఏడీజీ కార్యాలయంలో చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ హోదాలో పనిచేస్తున్న అతనికి హర్యానాలోని ఝజ్జర్‌లో ఉన్న ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. 

ఇలా ఉండగా,  ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ సంఖ్య రానురాను పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య 51 వేలను దాటింది. నిమిషం నిమిషానికీ ఈ సంఖ్య ఎక్కువ అవుతోంది. 

మరోవైపు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో సగానికి పైగా యూరప్ దేశాల్లోనే నమోదయ్యాయి. వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వారి సంఖ్య అక్కడ 5 లక్షలు దాటింది. 35 వేలకు పైగా మరణాలు యూరప్‌‌‌‌లో నమోదయ్యాయి. 

కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఇటలీ 13 వేలకు పైగా మరణాలతో ఫస్ట్ ప్లేస్లో ఉండగా, 10 వేల డెత్ లతో స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. ఈ రెండు దేశాల్లోనూ పాజిటివ్ కేసులు లక్ష దాటాయి.