5న రాత్రి  9 నిమిషాల పాటు దీపాలు వెలిగించండి 

కరోనాపై విజయం సాధించేందుకు దేశ ప్రజలంతా మరోసారి సంకల్పం చాటాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి దేశ ప్రజలకు  పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న ఆదివారం రాత్రి కరోనా చీకట్లను తరిమికొట్టాలని కోరారురు. ఆరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేయాలని చెప్పారు. ఎవరెక్కడున్నా లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలని ప్రధాని కోరారు. 

ఈ సందర్భంగా సామాజిక దూరం (సోషల్ డిస్టెన్సింగ్) పాటించాలని స్పష్టం చేశా. విద్యుత్ లైట్లన్నీ ఆర్పివేసి కొవ్వొత్తి, దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్ వెలిగించాలని సూచించారు. తద్వారా దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు మరోసారి కరోనాను పారదోలేందుకు తమ సంకల్పం చాటాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. 

ఆ మేరకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇవాళ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ముందుగా ప్రకటించినట్టుగానే సరిగ్గా ఉదయం 9 గంటలకు ఆయన ట్విటర్ వేదికగా ఈ వీడియో షేర్ చేసుకున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి కలిసి నడుస్తున్న దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా ధన్యావాదాలు తెలిపారు.  

కొవిడ్-19పై భారత్ చేస్తున్న పోరాటాన్ని చాలా దేశాలు అనుసరిస్తున్నాయని ప్రధాని గుర్తు చేశారు. జనతా కర్ఫ్యూతో దేశ ప్రజలు తమ సామర్థ్యాన్ని చాటారని కొనియాడారు. దేశ ప్రజలంతా ఒక్కటిగా నిలిచి కరోనాను జయించాలని పిలుపిచ్చారు. ఐక్యంగా పోరాడితేనే విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. 

 ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్టేననిప్రధాని తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని మోదీ కొనియాడారు. కరోనా మహమ్మారిని జయించేందుకు రాబోయే ఐదు రోజులు అత్యంత కీలకమని ప్రధాని గుర్తుచేశారు.