960 మంది `తబ్లిగీ జమాత్' విదేశీయుల విసాల రద్దు 

తబ్లిగీ జమాత్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న 960 మంది విదేశీయులను కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. వీరి వీసాలను రద్దు చేయడంతోపాటు విదేశీ చట్టం, విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది. 

పర్యాటక వీసాల కింద భారత్‌కు వచ్చిన వీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు భారత వీసాలను రద్దు చేయడంతోపాటు వారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్లు తెలిపింది. 

విదేశీ చట్టం, విపత్తు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించిన 960 మంది తబ్లిగీ విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులతోపాటు వారు ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల డీజీపీలను ఆదేశించినట్లు వెల్లడించింది. 

దేశవ్యాప్తంగా సుమారు 9 వేల మంది తబ్లిగీ సభ్యులు, వారు తొలుత కలిసిన వారిని క్వారంటైన్‌లో ఉంచినట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలిల శ్రీవాస్తవ తెలిపారు. ఇందులో 1,306 మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపారు. 

ఢిల్లీలోని 2000 మంది జమాత్‌ సభ్యుల్లో 1,804 మందిని క్వారంటైన్‌కు తరలించాలమని, వైరస్‌ లక్షణాలున్న 334 మందిని దవాఖానల్లో చేర్చామని ఆమె వివరించారు. 

ఇలా ఉండగా, వైరస్‌ వ్యాప్తిపై తప్పుడు వార్తలు, వదంతుల నియంత్రణకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. 

వార్తల్లోని వాస్తవాలను గుర్తించే ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ (ఎఫ్‌సీయూ) గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిందని, ప్రజలు pibfactcheck@gmail.com కు మెయిల్‌ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఆమె సూచించారు. రాష్ట్రాల స్థాయిల్లోనూ ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించామని ఆమె వెల్లడించారు. 

కాగా, కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి సమీపిస్తే అప్రమత్తం చేసే మొబైల్‌ యాప్‌ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. దీనికి ఆరోగ్యసేతు అని పేరు పెట్టింది. కరోనా పాజిటివ్‌ వ్యక్తుల ఫోన్‌నంబర్ల ఆధారంగా వారి కదలికలను పరిశీలిస్తూ ఈ యాప్‌ పని చేస్తుంది. ఆ వ్యక్తులకు సమీపంలో ఉన్నవారిని హెచ్చరించేలా దీనిలో తగిన ఏర్పాట్లు చేశారు.