నేటి నుంచి జన్‌ధన్ ఖాతాల్లో  రూ  500

నేటి నుంచి జన్‌ధన్ ఖాతాల్లో తొలి విడతగా రూ.500 డబ్బులు వేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ వేళ పేదలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యామ్ ప్యాకేజీ కింద ఈ డబ్బును పంపిణీ చేయనున్నారు. దీంతో 20 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు.

జన్‌ధన్ యోజన ఖాతాదారులకు మూడు నెలలపాటు రూ.500 చొప్పున బ్యాంక్‌లో డిపాజిట్ అవుతాయి. ఈ డబ్బును విత్‌డ్రా చేసుకునే సమయంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం కోరింది. అలాగే బ్యాంకులు కూడా డబ్బు పంపిణీలో షెడ్యూల్‌ను అనుసరించాలని కేంద్రం సూచించింది. 

లబ్ధిదారులు బ్యాంక్ ఖాతా చివరి సంఖ్య ఆధారంగా తమ డబ్బు విత్‌డ్రా నియమాలను పాటించాలని తెలిపింది. దేశంలో లాక్‌డౌన్ సమయంలో అవసరమైన వారికి డబ్బును బదిలీ చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చే జన్‌ధన్ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల ప్రకటించారు. 

మొదటి విడత ఏప్రిల్ 3న ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తారు. జమ చేసే తేదీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. జన-ధన్ ఖాతాల్లో జమ చేయడం గురువారం నుంచి ప్రారంభిస్తారు. ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఎస్‌బిఐ బ్రాంచ్‌ల వద్ద హడావిడి ఉండనుంది. బ్యాంకులు, ఎటిఎంల వద్ద పోలీసులను మోహరిస్తారు. 

లాక్‌డౌన్ వేళ బ్యాంకు నుండి డబ్బును తీసుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కరోనా వైరస్ ప్రభావం దృష్టా ఖాతాదారులు బ్యాంకుల వద్ద సామాజిక దూరం జాగ్రత్త పాటించాలి. అలాగే బ్యాంక్ ఉద్యోగులకు దూరంగా ఉండాలి. బ్యాంకులలో శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నారు. చేతులు బాగా శుభ్రం చేసుకున్న తర్వాతే బ్యాంకుల్లోకి ప్రవేశించాలి. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.