లాక్‌డౌన్‌ అనంతర వ్యూహంకు మోదీ పిలుపు 

ప్రస్తుతం అమలు జరుపుతున్న లాక్‌డౌన్‌ అనంతరం అనుసరించవలసిన వ్యూహంపై దృష్టి సారించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధాన మంత్రులకు సూచించారు. కోవిడ్-19 సందర్భంగా తీసుకొంటున్న చర్యలపై ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ఆయన లాక్‌డౌన్‌ ముగిశాక ప్రజలంతా మూకుమ్మడిగా బయటకొచ్చే అవకాశం ఉందని ఇదే జరిగితే మరోసారి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. 

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు నియంత్రించేందుకు రాష్ట్రాలన్నీ ఉమ్మడిగా వ్యూహాన్ని రచించాలని పేర్కొన్నారు. . సంక్షోభం నుంచి బయటపడే అంశాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎంలు ధార్మిక సంస్థల నేతలతో చర్చించాలని సూచించారు.  కరోనా బాధితులను ఆదుకునేందుకు అవసరమైన ఆసుపత్రులు, మెడికల్‌ కిట్లు సమకూర్చుకోవాలని తెలిపారు. 

దీంతో పాటు ఎన్సిసీ క్యాండెట్, ఎన్ఎస్ఎస్, ఆయుష్ డాక్టర్లను రాష్ట్రాలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద నిధులు వస్తున్న నేపథ్యంలో బ్యాంకుల వద్ద గుంపులుగా చేరకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

రైడ్ షేరింగ్ అప్లికేషన్ ద్వారా ధాన్యాలను సేకరించే అవకాశం పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పంట కోతల సమయం కనుక రైతులకు కొన్ని మినహాయింపులతో వారు పనులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, వారిని గుంపులుగా చేరకుండా పర్యవేక్షించాల్సి ఉందని గుర్తు చేశారు. 

కరోనా కట్టడికి రాష్ట్రాలు ఒక్కటై కృషి చేయడం ప్రశంసనీయమని ప్రధాని కొనియాడారు.  రానున్న మరి కొన్ని వారాలలో కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారిని ఐసోలేషన్‌లో ఉంచడం, క్వారంటైన్ చేయడం వంటి అంశాలపైనే దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు. అత్యవసర ఔషధాల సరఫరా, మందులు, వైద్య పరికరాల తయారీకి అవసరమైన ముడి సరుకుల లభ్యతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని ఆయన చెప్పారు. 

దాదాపు 10 రోజుల క్రితం దేశంలో లాక్‌డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వ సాహసోపేతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రులు ప్రశంసించగా ప్రాణనష్టం తగ్గించడానికే ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని ప్రధాని వారికి వివరించారు.  ఈ వైరస్ ఎక్కువగా నెలకొన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడి నుండి అది ఇతర ప్రాంతాలకు విస్తరింపకుండా కట్టడి చేయాలని స్పష్టం చేశారు. 

కరోనాపై గత నెల తొలిసారి 20న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ జరిపిన ప్రధాని, నేడు రెండో సారి జరిపారు.  ప్రజలు భౌతిక దూరం పాటించడానికి చేపట్టిన లాక్‌డౌన్ అనే ముఖ్యమైన అంశం కొంతమేరకు సత్ఫలితాలు ఇచ్చిందని  పేర్కొన్నారు. 

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాల్సి ఉందని ఈ సందర్భంగా  కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను జిల్లా స్థాయిలో పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. 

దేశంలో పెరిగిన కేసుల గురించి, నిజాముద్దీన్ మర్కజ్ నుంచి విస్తరించిన కేసుల వివరాలు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ వెల్లడించారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలతో పాటు, అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో వైరస్ వ్యాప్తి చెందే గొలుసును ఛేదించాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు. 

ఇలా  ఉండగా, గత 24 గంటల వ్యవధిలో 12 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం దేశంలో ఇదే తొలిసారని ఆయన చెప్పారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 328 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని, వీటితో కలుపుకొని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,965 కరోనా కేసులు నమోదు కాగా, 50 మంది మృతి చెందినట్లు లవ్ అగర్వాలు తెలిపారు.