ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి హర్షవర్ధన్ కళ్లెం

ఆరోగ్యపరంగా ఎటువంటి విపాతికర పరిస్థితులు ఏర్పడినా ప్రజలను భయకంపితులను కావించి, వాయురని నిలువ దోపిడీ చేయడం మనదేశంలో ప్రైవేట్ ఆసుపత్రులకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఎయిడ్స్ మహమ్మారి దేశ ప్రజలను భయకంపితులను కావించినప్పుడు అదే విధంగా జరిగింది. ప్రభుత్వ ఆసుపాత్రులలో తగిన మౌలిక సదుపాయాలు లోపిస్తు ఉండడంతో, మధ్య తరగతి ప్రజలు సహితం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించక తప్పడం లేదు. 

అయితే ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ కకావికలం చేస్తున్న సమయంలో మాత్రం ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చాలావరకు కళ్లెం వేసిన ఘనత కేంద్ర ఆరోయ మంత్రి హర్ష వర్ధన్ కు దక్కుతుంది. స్వయంగా వైద్యుడైన ఆయనకు ప్రైవేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణి బాగా తెలిసి ఉండడంతో మొదటగా చైనాలో ఈ వైరస్ సోకినప్పటి నుండే మనదేశంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం పట్ల దృష్టి సారించారు. అందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. 

ప్రభ్థ్వత్వ ఆసుపత్రులలోనే కరోనా పరీక్షలు జరిపే ఏర్పాట్లు చేశారు. ఆలస్యంగా కొన్ని ప్రైవేట్ ల్యాబ్ లను అనుమతి ఇచ్చిన ఒకొక్క పరీక్షకు రూ 4,500 మించి ఛార్జ్ చేయరాదని, నోడెల్ ఆసుపత్రి వైద్యుల సిఫార్స్ పైననే చేయాలనీ నిబంధన పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలే పెద్ద ఎత్తున ఖ్వారంటైన్ గదులను ఏర్పాటు చేసే సదుపాయం కల్పించారు. ముందే జర్మనీ నుండి పెద్ద ఎత్తున టెస్టింగ్ కిట్ లను దిగుమతి చేసుకొని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన మేరకు అందుబాటులో ఉంచారు. 

దాదాపు అన్ని పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులను కరోనా ఆసుపత్రులుగా మార్చారు. మరో వంక లాక్ డౌన్ కూడా అమలులో ఉండడంతో ప్రైవేట్/కార్పొరేట్ ఆసుపత్రులకు రోగుల రాక కూడా తగ్గిపోయి ఖాళీగా ఉండవలసి వచ్చింది. ఈ విపత్కర పరిస్థితులలో నిలువు దోపిడీ చేయలేక పోయామని మదన పడుతున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వాలు సహితం మొదటగా ప్రభుత్వ ఆసుపత్రులు, మరింకా అవసరమైతే ప్రైవేట్ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను ఉపయోగించుకొని, ఆ తర్వాతనే ప్రైవేట్ ఆసుపత్రుల వద్దకు వస్తామని స్పష్టం చేశాయి. పైగా, ప్రభుత్వమే ఈ సేవల కోసం పెద్ద ఎత్తున నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని పెద్ద ఎత్తున నియమించుకొంటూ ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణ వైద్య సేవలకు సహితం అనుబంధ సిబ్బంది కొరత ఏర్పడుతున్నది. తగినంతమంది సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. 

1991లో ఆర్ధిక సంస్కరణల యుగం ప్రారంభమైన తర్వాత ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు సేవలు అందించడం బహుశా ఇదే ప్రధమం కావచ్చు. ముఖ్యంగా ఇప్పుడు తాత్కాలిక సిబ్బందిగా చేరినా తర్వాత శాశ్వతంగా ప్రభుత్వం ఉద్యోగం లభించవచ్చని ఆశతో నర్సులు, ఇతర సాంకేతిక సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దానితో ప్రైవేట్ ఆసుపత్రులలో అత్యవసర సేవలకు సహితం సిబ్బంది కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి.