నిజాముద్దీన్‌  వారితోనే తెలంగాణలో లొల్లి  

విదేశాల నుంచి వచ్చిన వారి కన్నా, ఢిల్లీలోని నిజాముద్దీన్‌  ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారిలో కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలో ఈ వైరస్ తగ్గుముఖం పట్టినదని, ఏప్రిల్ 7 నాటికి కనుమరుగవుతోంది ఇంతకు ముందు ప్రకటించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కరోనా సద్దుమణగలేదనీ, మరిన్నిరోజులపాటు దాని తీవ్రత కొనసాగే సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని ప్రజలను హెచ్చరించారు. 

అందువల్ల ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దనీ, తమకేం కాదనే భావన ఎంతమాత్రం తగదనీ బుధవారం సుదీర్ఘంగా సమీక్ష జరుపుతూ హితవు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండ్లనుంచి బయటకు రావద్దని సూచించారు.  ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారి సమాచారం సేకరించడంలో జాప్యంపై కేసీఆర్ అసహనం వ్యక్తంచేశారు. 

మంత్రులు, ఉన్నతాధికారులు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది మరింత జాగరూకతతో, అప్రమత్తతతో వ్యవహరించక తప్పదని హెచ్చరించారు. కరోనా వైరస్‌పై పోరాటానికి యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను తాను ప్రతిక్షణం గమనిస్తున్నానని, ఎవరూ ఎలాంటి అలక్ష్యం చూపకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హితవు చెప్పారు.  

రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 30 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తాజాగా మూడు మరణాలు సంభవించాయని, వీరంతా ఢిల్లీ నిజాముద్దీన్‌ తబ్లిగీ జమాత్‌లోని మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారేనని పేర్కొన్నారు. బుధవారం గాంధీలో ఇద్దరు, యశోదా హాస్పిటల్‌లో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో మరణించిన వారిసంఖ్య తొమ్మిదికి చేరింది. 

బుధవారం వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిన 30 మంది, మరణించిన ముగ్గురూ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారేనని తేలింది. గతంలో మరణించిన ఆరుగురు కూడా మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారే. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొందరికి, వారిద్వారా మరి కొంతమందికి వైరస్‌ సోకింది. వారంతా క్రమంగా కోలుకొంటున్నారు. వారిలో చాలా మంది డిశ్చార్జి  అయ్యారు. వారిలో ఎవరి పరిస్థితి ఆందోళనకరంగా లేదు, చనిపోలేదు.