గాంధీలో వైద్య సిబ్బందిపై దాడి 

గాంధీ దవాఖానలో కరోనా పాజిటివ్‌ రోగి మృతిచెందటంతో ఉద్రిక్తత నెలకొన్నది. కొవిడ్‌ -19 పాజిటివ్‌తో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి బుధవారం మృతిచెందాడు. అదే వార్డులో కరోనా చికిత్స పొందుతున్న మృతుడి బంధువు.. ఇతరులతో కలిసి వైద్యసిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. 

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు కరోనా పాజిటివ్‌తో గాంధీలోని ఐసొలేషన్‌వార్డులో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరు (49) బుధవారం సాయంత్రం మృతిచెందాడు. ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించగా.. అక్కడే ఉన్న మృతుడి బంధువు వైద్యసిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. 

అడ్డువచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని గాయపరిచాడు. అతడికి మిగిలినవారు కూడా తోడయ్యారు. విషయం తెలుసుకున్న చిలకలగూడ పోలీసులు గాంధీ దవాఖానకు చేరుకున్నారు. అయితే, కరోనా వార్డులో ఘటన జరుగడంతో పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లేందుకు వెనుకాడారు. 

సీపీ అంజనీకుమార్‌, డీసీపీ కల్మేశ్వర్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు అక్కడకు చేరుకొని ఘటనపై వైద్యులతో మాట్లాడారు. దాడికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకొని అక్కడే ప్రత్యేక వార్డులో చికిత్స చేస్తున్నారు. మందులు కూడా లేని మహమ్మారికి చికిత్స అందిస్తూ గొప్పసేవలు చేస్తున్న వైద్యులపై దాడి జరుగడం హేయమైన చర్య అని, బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్ఛారు. 

ఇద్దరు అదనపు డీసీపీలతోపాటు టాస్క్‌ఫోర్స్‌, టీఎస్‌పీఎస్‌ సిబ్బందితో దవాఖానకు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. వైద్యులు, పోలీసులతో వాట్సాప్‌ గ్రూప్‌ తయారుచేసి వారికి రక్షణగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

గాంధీ దవాఖానలో వైద్యసిబ్బందిపై జరిగిన దాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమని, దాడిచేసినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. వైద్యులు, సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తుంటే దాడిచేయడం హేయమైన చర్య అంటూ ఖండించారు. వైద్యులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని హామీ ఇస్తూ, ప్రతిఒక్కరూ భరోసాతో పనిచేయాలని మంత్రి కోరారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. కరోనా వైరస్‌ సోకినవారికి చికిత్స అందిస్తున్న వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలని హైదరాబాద్‌ సీపీని ఆదేశించినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. వైద్యులపై దాడిని తెలంగాణ ఉద్యోగుల సంఘం ఖండించగా.. దవాఖానలో సీఆర్‌పీఎఫ్‌ పోలీసులతో రక్షణ కల్పించాలని జూనియర్‌ డాక్టర్లు కోరారు.  

గాంధీలో వైద్యులపై దాడిని బిజేపి ఎంపి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులపై దాడి మంచిదికాదని హితవు చెప్పారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.