తబ్లిగీ జమాత్‌ వారి కోసం రాష్ట్రాల జల్లెడ 

దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో తబ్లిగీ జమాత్‌ సంస్థ నిర్వహించిన మత కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చిన వారి కోసం రాష్ట్రాలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటివరకు 6000 మందిని గుర్తించారు. మరో 2 వేల మంది కోసం గాలిస్తున్నారు. ఆయా రాష్ర్టాల్లో కొత్తగా వెలుగుచూసిన పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ మంది ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చినవారే ఉంటున్నారు. 

300కుపైగా కేసులకు మర్కజ్‌తో లింకులు ఉన్నాయి. వీటిలో ఒక్క తమిళనాడులోనే 190 కేసులున్నాయి. ఆ తర్వాత ఏపీలో 70, ఢిల్లీ 24, తెలంగాణ 21, అసోం 13, అండమాన్‌ 10, పుదుచ్చేరి 2, కశ్మీర్‌లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, కరోనా వ్యాప్తికి కేంద్రకంగా మారిన నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ఉన్నవారిని ఎట్టకేలకు ఖాళీచేయించారు. గత 36 గంటల్లో మొత్తం 2,361 మందిని అక్కడి నుంచి తరలించారు. వారిలో 617 మందిని వివిధ దవాఖానలకు తరలించగా, మిగిలినవారిని క్వారంటైన్‌లో ఉంచారు. 

మర్కజ్‌ కార్యక్రమంలో పాల్గొన్నవారితో కలిసి ఐదు రైళ్లలో ప్రయాణించిన వేల మంది ప్రయాణికుల వివరాలు అందించే పనిలో రైల్వే శాఖ నిమగ్నమైంది. మార్చి 13-19 మధ్య వీరు ఢిల్లీ నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌, గ్రాండ్‌ ట్రంక్‌ ఎక్స్‌ప్రెస్‌, తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌, ఢిల్లీ-రాంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌, ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు.

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిజాముద్దీన్‌ ప్రాంతంలో తబ్లిగీ జమాత్‌ సంస్థ నిర్వహించిన సమ్మేళనంతో ‘భారీ నష్టం’ వాటిల్లిందని జాతీయ మైనార్టీ కమిషన్‌ (ఎన్సీఎం) పేర్కొన్నది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మదర్సాలు, మతపరమైన ప్రాంతాల్లోనూ ఆంక్షలను కఠినంగా అమలుచేయాలని రాష్ట్రాలకు సూచించింది. 

ఈ మేరకు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్సీఎం అధినేత సయ్యద్‌ ఘయోరుల్‌ హసన్‌ రిజ్వీ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ సమయంలో నిజాముద్దీన్‌ ఘటన తీవ్రమైన ఉల్లంఘన అని, ఇది పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

కాగా, భారత్‌లో నేటి ఉదయం వరకు 2027 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 169 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 335, కేరళలో 265 కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో 234, ఢిల్లీలో 152, రాజస్థాన్‌లో 120, ఉత్తరప్రదేశ్‌లో 177, ఆంధ్రప్రదేశ్‌లో 111, కర్ణాటకలో 110, తెలంగాణలో 105 నమోదయ్యాయి. 

ఇక, గుజరాత్‌లో 87, మధ్యప్రదేశ్‌లో 86, జమ్మూకశ్మీర్‌లో 62, పంజాబ్‌లో 46, హర్యానాలో 43, పశ్చిమ బెంగాల్‌లో 37, బీహార్‌లో 24, చండీఘర్‌లో 17, అసోంలో 13, లడఖ్‌లో 13, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 10, ఛత్తీస్‌గఢ్‌లో 9, ఉత్తరాఖండ్‌లో 7, గోవాలో 5, ఒడిశాలో 5, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, పుదుచ్చేరిలో 3, జార్ఖండ్‌, మణిపూర్‌, మిజోరంలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.