కరోనా దెబ్బకు అల్లాడుతున్న అమెరికా 

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) దెబ్బకు అమెరికా అల్లాడుతున్నది. బుధవారంనాటికి ఈ మహమ్మారి  5,110 మందిని బలితీసుకున్నది. ఆధునిక అమెరికా చరిత్రలోనే ఘోర విషాదాన్ని నింపిన 9/11 దాడులను మించిపోయింది. ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలోనే 1,550 మందికి పైగా మృత్యువాతపడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

గడిచిన 24 గంటల్లో 25,200 కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,15,175కు చేరుకుంది.  వచ్చే రెండు వారాలు మరింత దుర్భరంగా ఉండనున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజలను హెచ్చరించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8.60 లక్షలు దాటింది. 42 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.

2001 సెప్టెంబర్‌ 11న అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఆల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో దాదాపు 3,000మంది మరణించారు. ఇప్పుడు కరోనా మరణాలు ఆ సంఖ్యను దాటిపోయాయి.  అమెరికాలోని హవాలీ ప్రాంతంలో ఉన్న పెర్ల్‌ హార్బర్‌ నావికా స్థావరంపై 1941 డిసెంబరు 7న జపాన్‌ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో అమెరికా 3,059 మందిని కోల్పోయింది. 

అమెరికా చరిత్రలో అపార ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన ప్రకృతి వైపరీత్యం ఇది. 2017 సెప్టెంబరు 16న మారియా హరికేన్‌ విరుచుకుపడి మూడువేలమందికిపైగా పొట్టనబెట్టుకున్నది.   

నిర్ణీత దూరాన్ని పాటించడం, వలస కార్మికుల్ని అడ్డుకోవడం వంటి చర్యలతో అమెరికాలో మృతుల సంఖ్య తగ్గిందని అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో ఏర్పాటు చేసిన ‘కరోనా వైరస్‌ టాస్క్‌ ఫోర్స్‌' సభ్యుడు డీబోరాహ్‌ బిర్క్స్‌ తెలిపారు. ఒకవేళ ఈ రెండు చర్యలు తీసుకోకుంటే మరణాల సంఖ్య 15 లక్షల నుంచి 22 లక్షలుగా ఉండేదని హెచ్చరించారు. 

అమెరికాలో వైరస్‌కు కేంద్రంగాఉన్న న్యూయార్క్‌ రాష్ట్రం లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 75 వేల కేసులు నమోదయ్యాయని, 1,550 మంది మృతిచెందారని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో తెలిపారు. గత 24గంటల్లో 332 మంది మరణించినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోనున్నామన్నారు. 

కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపుగా పయనిస్తున్నది. ఈనేపథ్యంలో  అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకిచ్చే హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ని ఈ ఏడాదికి నిలిపి వేయాలని ‘అమెరికన్‌ టెక్నాలజీ వర్కర్స్‌' అనే సంస్థ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఓ లేఖను రాసింది.

ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ వాతావరణంలో పెద్ద స్థాయిలో అమెరికన్లు ఉపాధి అవకాశాల్ని కోల్పోనున్నారని, ఈ సమయంలో విదేశీయులకు హెచ్‌-1బీ వీసాల్ని జారీ చేస్తే పరిస్థితి మరింత దిగజారే అవకాశమున్నదని విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు విదేశాల్లోని కార్మికులకు తాత్కాలికంగా ఇచ్చే హెచ్‌-2బీ వీసాలను కూడా నిలిపివేయాలని కోరింది.