కరొనాకు ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌' సిఫార్స్ 

కరోనాతో ఆరోగ్యం విషమించినవారికి యాంటీ మలేరియా ఔషధం ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌'ను ‘ఎజిత్రోమైసిన్‌'తో కలిపి వాడొచ్చని కేంద్ర వైద్య శాఖ సిఫార్సు చేసింది. అయితే ఈ మందును 12 ఏండ్లలోపు పిల్లలకు, గర్భిణులకు సిఫార్సు చేయడం లేదని తెలిపింది. ఈ మేరకు కరోనా ‘క్లినికల్‌ నిర్వహణ’పై  కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 

ప్రత్యేకించి ఏ యాంటీవైరల్‌ మందు కూడా కరోనాపై ప్రభావవంతంగా పనిచేస్తున్న నిర్ధారణ కాలేదని, అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని అనుసరించి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సిఫార్సు చేస్తున్నట్లు తెలిపింది. 

ఇంతకుముందు సిఫార్సు చేసిన యాంటీ హెచ్‌ఐవీ మందులను (లొపినవీర్‌, రిటోనవీర్‌) కేంద్రం ఉపసంహరించుకున్నది. వీటి వల్ల రోగులకు పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని అందుకే ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.

ఇలా ఉండగా, కరోనా పరీక్షలు జరిపే కిట్ల నాణ్యతలో రాజీ పడబోమని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్‌ హెచ్చరించారు. పరీక్ష కిట్ల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌), శాస్త్ర సాంకేతిక, బయో టెక్నాలజీ శాఖ ఉన్నతాధికారులతో కొవిడ్‌-19 పరీక్షల కార్యాచరణ, కిట్ల నమూనా వంటి అంశాలపై సమీక్ష జరిపారు.

కాగా, కరోనాను ఎదుర్కొనే క్రమంలో దేశవ్యాప్తంగా ఎలాంటి మందుల కొరత లేకుండా చూస్తున్నమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మందుల సరఫరాకు సంబంధించిన వ్యవరాలను ఫార్మాస్యూటికల్స్‌ శాఖ (డీవోపీ) నిరంతరం పర్యవేక్షిస్తున్నదని కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వశాఖ పేర్కొంది.