మోదీ ప్రభుత్వంపైనే ప్రజల విశ్వాసం 

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదని, సమర్ధవంతంగా ఈ క్లిష్ట పరిస్థితులలో దేశాన్ని నడిపిస్తున్నారని భారత ప్రజలు భావిస్తున్నారు.  దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం సహా ఈ కాలంలో ఇటు సామాన్యుడికి, అటు పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా పలు పథకాలను సైతం ప్రకటించడం పట్ల ప్రజామోదం వ్యక్తం అవుతున్నది. 

కరోనా వైరస్‌ సంక్షోభాన్ని మోదీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొనగలదని వివిధ రాష్ట్రాలకు చెందిన 83.5 శాతం మంది ప్రజలు విశ్వసిస్తున్నట్టు వెల్లడైనది. ఐఏఎన్ఎస్-సీవోటర్ గాలప్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ‘కొవిడ్-19 వేవ్ 2’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గత ఏడు రోజుల్లో కంప్యూటర్ అసిస్టెడ్ టెలీఫోన్ ఇంటర్వ్యూ (సీఏటీఐ) ఆధారంగా 18 ఏళ్లు పైబడిన పౌరుల నుంచి వివరాలు సేకరించి సర్వేలో పొందుపర్చారు. ఇందులో ఓ ప్రశ్నకు సమాధానంగా ‘‘కరోనా వైరస్‌ను భారత ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కుంటోందని భావిస్తున్నా..’’ అంటూ 83.5 శాతం మంది ప్రభుత్వంపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

ఇందులో 66.4 శాతం మంది గట్టిగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చగా.. మరో 17.1 శాతం మంది మాత్రం సమ్మతిని తెలియపర్చారు.  కేవలం 9.4 శాతం మంది మాత్రం కరోనా కట్టడిపై మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏకీభవించలేదని సర్వే పేర్కొంది. 

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఇప్పటికే 1200 దాటిపోగా.... ఈ ప్రాణాంతక మహమ్మారి కారణంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు.