వరవరరావు బెయిల్ కు మరోసారి తిరస్కరణ 

ఎల్గార్ పరిషత్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవర రావు,  నాగపూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సోమా సేన్ షోమా సేన్‌లకు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలంటూ వీరిద్దరూ పిటిషన్ దాఖలు చేశారు. 

దీనిపై ఇవాళ విచారణ జరిపిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి ఆర్ఆర్ భోస్లే.. తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించారు. నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అభియోగాలు ఉన్నాయనీ.. ఖైదీల విడుదలకు సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రకటనకు ఉపా చట్టం వర్తించదని న్యాయమూర్తి పేర్కొన్నారు.  

61 ఏళ్ల షోమా సేన్ ప్రస్తుతం బైకుల్లా మహిళా కారాగారంలో ఉండగా.. 80 ఏళ్ల వరవర రావును తలోజా సెంట్రల్ జైల్లో ఉంచారు. పుణేలోని ఎరవాడ జైలు నుంచి ఇటీవలే వీరిని తరలించిన విషయం తెలిసిందే. 

కాగా కరోనా వైరస్ కారణంగా జైళ్లలోకి సందర్శనలు నిలిపివేయండంతో.. తమ న్యాయవాదులు, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు టెలీఫోన్ సౌకర్యం కల్పించాలన్న విజ్ఞప్తిని మాత్రం కోర్టు మన్నించింది.