నెల్లూరులో రెండు డివిజన్లలో కర్ఫ్యూ వాతావరణం 

నెల్లూరులో 43, 47 డివజన్లలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఢిల్లీలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఆ ప్రాంతానికి చెందిన వారు కొంతమంది వున్నారు. ఢిల్లీలో ఈ కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన వారికి కరోనా వైరస్ సోకడం, వారిలో కొంతమందికి పాజిటివ్ రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ విషయంలో వేగంగా స్పందించింది. 

నెల్లూరు జిల్లా నుంచి 70 మంది ఢిల్లీలో జరిగిన ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. నెల్లూరు పెద్దబజారు చేపల మార్కెట్ నుంచి కోటమిట్ట మీదుగా ములుమూడి బస్టాండ్ వరకు చిన్నబజారుని కలుపుకుని పూర్తిగా లాక్ డౌన్ చేశారు. కర్ఫ్యూ అమలులో వున్నట్లుగా కూడా చెబుతున్నారు. 

దీనివల్ల ఆ ప్రాంతంలో ఢిల్లీకి వెళ్ళివచ్చిన వారు ఎవరో కనుక్కుని వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. వారిని క్వారంటైన్ లో వుంచుతారు. ఆ తర్వాత వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, వారు ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరెవరిని కలిసింది తెలుసుకుని, వారిని కూడా పిలిపించి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తారు. 

కాగా, ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ మసీదుకు వెళ్లి వచ్చిన వారితోనే ఒ‍క్కసారిగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటివరకూ రాష్ట్రంలో 23 కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా, ఇవాళ ఒక్కసారిగా ఆ సంఖ్య 40కి చేరిందని చెప్పారు.  ఢిల్లీకి వెళ్లివచ్చిన వారు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు.