ఉద్యోగుల జీతాల కోతపై బిజెపి అభ్యంతరం 

లాక్ డౌన్ కారణంగా ఒక వంక అంత దిగ్బంధనం కొనసాగుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ఉద్యోగుల జీతాలతో కొత్త విధించడం పట్ల తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరిలోపట భరోసా కల్పించాల్సిన సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో చర్చించకుండా,  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల,ఉపాద్యాయుల మరియు పెన్షనర్ల మార్చి నెల జీతాలలో  50 శాతం తగ్గించటం గురించి పునరాలోచించాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కోరారు. 

ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలో ధనిక రాష్ట్రంగా ప్రకటించుకొని, కోవిడ్-19 సమస్య మొదలైన మొదటి నెలలోనే ఇటువంటి నిర్ణయం తీసుకోవటం,కేవలం 15 రోజుల లాక్ డౌన్ కే ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా తయారైందంటే నమ్మశక్యంగా లేదని స్పష్టం చేశారు. జీవన వ్యయ ప్రమాణాలకు అనుగుణంగా వేతన సవరణ జరగక, ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వ నిర్ణయం అశనీపాతం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. .

కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల వేతనాల విషయంలో, ఇటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. వేతనంపై ఆధారపడి బ్రతికే ఉద్యోగుల వేతనాల్లో ఏక పక్షంగా 50 శాతం కోత విధిస్తే కుటుంబాల జీవన పరిస్థితి అస్తవ్యస్థమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

స్వయంగా ప్రధాన మంత్రి లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగస్తుల, కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని చెప్పారని గుర్తు చేశారు. కానీ, కేసీఆర్ తీసుకున్న నిర్ణయంను అలుసుగా తీసుకొని, ప్రైవేట్ కంపెనీలు, వ్యాపారస్తులు, తమ దగ్గర పనిచేసే ఉద్యోగస్తుల, కార్మికుల జీతాల్లో  కోతలు విధించే ప్రమాదం ఉందని హెచ్చరించారు . భారతదేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని విస్మయం వ్యక్తం చేశారు. 

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక, సహాయక చర్యల్లో పలు శాఖల ఉద్యోగులు అహర్నిశలు పని చేస్తూ ప్రభుత్వ ప్రతిష్ట పెంపుదలకు ప్రయత్నిస్తున్నారని సంజయ్ గుర్తు చేశారు. ఉద్యోగుల, పెన్షనర్ల పరిస్థితిని అర్థం చేసుకుని తమ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని స్పష్టం చేశారు. 

ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న ఆరోగ్య శాఖ, వైద్యులు, నర్సులు, నాలుగవ తరగ తి సిబ్బంది, పోలీస్, ఇతర శాఖల సిబ్బంది కి పూర్తి వేతనాలు చెల్లించటం తో పాటు, వారికి మాస్కులు వంటి వ్యక్తిగత రక్షణ సామగ్రిని వెంటనే సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని సంజయ్ కోరారు. 

అయితే కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్ తీసుకుంటున్న చర్యల పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా తన సంపూర్ణ మద్దతు తెలిపారు. 

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్/ఆఫ్ లైన్ విధానం ద్వారా రాష్ట్ర కార్మిక శాఖ వద్ద నమోదైనా సుమారు 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కోసం ఉద్దేశించిన రూ 2300 కోట్ల సెస్ నిధులను ఖర్చు చేసుకునేలా అవకాశం కల్పిస్తూ, కేంద్ర కార్మిక శాఖ స్పష్టమైన ఆదేశాలను ఇచ్చిందని సంజయ్ గుర్తు చేశారు. 

దీనికి అనుగుణంగా, వెంటనే రాష్ట్రం లోని భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లోకి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా డబ్బు పంపించే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని సంజయ్ కోరారు.