ఏపీలో ఒక్కసారిగా 40కి చేరిన కరోనా కేసులు 

ఒకే రోజు 17 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ కుసుల సంఖ్య ఒకేసారి 40కు పెరిగింది. వారిలో చాలామంది ఢిల్లీలోని మార్కజ్ మసీద్ లో జరిగిన మతసంబంధ సమావేశాలకు వెళ్లి వచ్చినవారే. 

కొత్తగా పాజిటివ్ వచ్చిన 17 మందిలో ఎనిమిది మంది ప్రకాశం జిల్లా, అనంతపురానికి చెందిన వారు ఇద్దరు, ఐదుగురు గుంటూరు, ఒకరు కృష్ణా జిల్లా వాసి కాగా మరొకరు తూర్పు గోదావరికి చెందిన వారు ఉన్నారు. ప్రకాశం జిల్లా కేసుల్లో ఐదుగురు చీరాలకు చెందిన వారే కావడం గమనార్హం. 

గత రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం వరకు 164 మందిని పరీక్షించగా 147 మందికి నెగటివ్ వచ్చిందని, మిగతా వారికి పాజిటివ్ వచ్చిందని ఏపీ ప్రభుత్వం మెడికల్ బులిటెన్ విడుదల చేసింది. 

కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాల వారీగా మొత్తం 711 మంది వివరాలను ప్రకటించింది. వారంతా త్వరగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని ఆదేశాలిచ్చింది. 

విజయనగరం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం రూరల్‌లో ఒక్కరు, విశాఖపట్నం సిటీలో 41 మంది, తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో 16 మంది, రాజమండ్రిలో 21 మంది, కృష్ణా జిల్లాలో 16 మంది, విజయవాడ సిటీలో 27 మంది ఉన్నారు. 

ఇక, గుంటూరు అర్బన్‌లో 45 మంది, గుంటూరు రూరల్‌లో 43 మంది. ప్రకాశం జిల్లాలో 67 మంది, నెల్లూరు జిల్లాలో 68 మంది, కర్నూల్ జిల్లాలో 189 మంది, కడప జిల్లాలో 59 మంది, అనంతపూర్ జిల్లాలో 73 మంది, చిత్తూరు జిల్లాలో 20 మంది, తిరుపతికి చెందిన 16 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చారు. 

చిత్తూర్ జిల్లాకు చెందిన వారిలో 18 మంది ఇంకా రవాణా సదుపాయం లేకపోవడంతో అక్కడి మజీద్ లోనే చిక్కుకు పోయిన్నట్లు తెలుస్తున్నది. 

ఢిల్లీకి వెళ్లొచ్చి, పరీక్షలు చేయించుకోకుండా ఉన్న వీరి  వల్ల ఇంకెంత మందికి వైరస్ సోకిందోనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఒకవేళ వైరస్ మరింత మందికి సోకితే.. ఘోర ప్రమాదం ముంచుకొస్తున్నట్లేనని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.