జీతాలు చెల్లించలేని స్థితిలో జగన్ ప్రభుత్వం 

కారోనా వైరస్ తో ఆర్ధిక కార్యకలాపాలు స్తంభించి పోవడంతో తెలంగాణ ప్రభుత్వం జీతాలలో భారీ కొత్త విధించగా, ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అసలు జీతాలు చెల్లించే పరిస్థితులు కనబడటం లేదు. 

ఎంతగా ప్రయత్నించినా అప్పులు పుట్టక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి ఈ నెల జీతాలు వచ్చే అవకాశాలు లేవని సమాచారం. కేవలం 15 నురచి 20 శాతం శాఖల్లోని ఉద్యోగులకు మాత్రమే జీతాలు వస్తాయని అధికారులు అరటున్నారు. 

అందుకు ఒక వంక ఆర్ధిక ఇబ్బందులు కారణమైతే, మరో వంక  బిల్లులు సకాలంలో సమర్పించక పోవడం కారణంగా చెబుతున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సెలవులో ఉండటం, బిల్లులు పెట్టాల్సిన వారు కూడా లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుపోవటం, వంటి కారణాలు చెబుతున్నారు. 

మరోవంక అప్పు కోసం ఆర్‌బీఐ ద్వారా బాండ్లు వేలం వేసినా కనీసం రూ.100 కోట్లు కూడా ప్రభుత్వానికి రాలేదు. ఆర్‌బీఐ ద్వారా ఓపెన్‌ మార్కెట్లో బాండ్లు/సెక్యూరిటీలు విక్రయించి అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన పరిమితిలో ఇంకా రూ.600 కోట్లు మిగిలాయి. మార్చి 31లోగా ఆ అప్పు తెచ్చుకోవాలి. గడువు దాటితే తెచ్చుకోవడం కుదరదు.  

రూ .600 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లు వేలానికి ఉంచితే కేవలం రూ.50 కోట్ల విలువైన బాండ్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అది కూడా 9.5 శాతం వడ్డీకి. సాధారణంగా ఆర్‌బీఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు వేలం వేసే బాండ్లపై వడ్డీ ఏడు నుంచి ఎనిమిది శాతం లోపే ఉంటుంది. 9.5 వడ్డీ శాతానికి రాష్ట్రం సిద్ధపడినప్పటికీ పూర్తిస్థాయిలో బాండ్లు కొనేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో వచ్చిన ఆ రూ.50 కోట్లను కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ తీసుకోలేదు.  

ఇలా ఉండగా, గత పదిరోజులుగా  లాక్‌డౌన్‌ కారణంగా  జీఎస్టీ వసూళ్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఎక్సైజ్‌ ఆదాయం పూర్తిగా ఆగిపోగా, పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల ద్వారా అతి స్వల్పంగా ఆదాయం వచ్చినా ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వ ఆర్ధిక అవసరాలను తీర్చుకోవడం కష్టమే అని భావిస్తున్నారు.