20 వేల రైలు బోగీల్లో క్వారంటైన్ వార్డులు

భారతీయ రైల్వేకు చెందిన 20,000 బోగీలే త్వరలో కరోనా వైరస్ రోగుల చికిత్స వార్డులుగా మారనున్నాయి. రైళ్ల కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చే ప్రక్రియకు సిద్ధం కావాలని రైల్వేబోర్డు జోన్ల అధికారులకు తెలిపింది. అన్ని రైల్వే జోన్ల జనరల్ మేనేజర్లకు బోర్డు ఈ మేరకు లేఖలు పంపించింది. మొత్తం 20వేల కోచ్‌లను చికిత్స వార్డులుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. 

ఈ మేరకు సరైన సాధనసంపత్తిని సమకూర్చుకుని ఉంటే మంచిదని ఈ లేఖలలో తెలిపారు. ఎప్పుడైనా ఆదేశాలు రావచ్చునని, ముందుగానే ఇందుకు ఏర్పాట్లు చేసుకుని ఉండాలని స్పష్టం చేశారు. దీనితో పలు జోన్లవారిగా అధికారులలో చలనం ఏర్పడింది. కోచ్‌లను క్వారంటైన్ సెంటర్లుగా మార్చేందుకు సంబంధించి రైల్వే ఉన్నతాధికారులు ఇప్పటికే సైన్యపు వైద్య సేవల అధికారులతో, వివిధ రైల్వే జోన్ల వైద్యవిభాగాల వారితో సంప్రదించారు.

తరువాత కోచ్‌లను తగు విధంగా తీర్చిదిద్దడంపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడైంది. కోచ్‌లను ఏ విధంగా ఐసోలేషన్ వార్డులుగా మార్చడం అనే అంశంపై ఐదు రైల్వే జోన్ల అధికారులు కసరత్తు చేపట్టారు. వీటికి సంబంధించి నమూనా కోచ్‌లను సిద్ధం చేశారు. 

దేశంలో కోవిడ్ వైరస్ సోకిన వారి సంఖ్య సోమవారానికి 1,071కు చేరుకుంది. మృతుల సంఖ్య 29గా నిర్థారణ అయిం ది. ఈ తరుణంలో కరోనా అనుమానితులకు, రోగులకు సరైన వైద్య చికిత్సలు నిర్వహించేందుకు ఇప్పుడున్న ఆసుపత్రులలోని ఐసోలేషన్ వార్డు లు సరిపోని పరిస్థితి ఏర్పడింది. 

లాక్‌డౌన్‌తో రైళ్లు నిలిచిపోయిన దశలో రైళ్లనే ఎందుకు వైద్య పరీక్షలకు వినియోగించుకోకూడదనే ఆలోచనతో ఇప్పుడు రైల్వేకోచ్‌లకు కొత్త రూపం ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది.