భారత్ వృద్ధి రేట్ పై కరోనా మహమ్మారి దుష్ప్రభావం 

మొత్తం ప్రపంచాన్ని కకావికలం కావిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ ఆర్ధిక మందగమనంకు దారితీస్తున్నట్లు ఇప్పటికే ఐఎంఎఫ్ ప్రకటించింది. దానితో భారత్ ఆర్ధిక వ్యవస్థపై కూడా దుష్ప్రభావం చూపుతున్నది. 

 అన్ని రంగాలు కుదేలవుతున్న క్రమంలో అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు ఇప్పటికే భారత వృద్ధి రేటు అంచనాలు తగ్గించగా, తాజాగా దేశీయ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ సైతం వృద్ధి రేటు అంచనాలో భారీ కోత విధించింది. కరోనా ప్రభావంతో 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 3.6 శాతానికి పరిమితమవుతుందని ఇండియా రేటింగ్స్‌  అంచనా వేసింది. 

ఏప్రిల్‌ మాసాంతం వరకూ పూర్తి, లేదా పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతుందని,మే తర్వాతే ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటాయని పేర్కొంది.  ఏప్రిల్‌ 14 వరకూ లాక్‌డౌన్‌ ప్రకటించడం ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుండటంతో ఇండియా రేటింగ్స్‌ భారత వృద్ధి రేటు అంచనాల్లో భారీ కోత విధించింది.

జూన్‌ త్రైమాసంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కేవలం 2.3 శాతంగా ఉంటుందని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది. టూరిజం, ఆతిథ్య, పౌరవిమానయాన రంగాలు దాదాపు కుప్పకూలిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది.చిన్న వ్యాపారాల్లో నగదు ప్రవాహం తగ్గిపోయిన పరిస్ధితి కనిపిస్తోందని పేర్కొంది. 

ఆర్థిక సేవలు, ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు మాత్రం మారిన పరిస్ధితులకు అనుగణంగా ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయిస్తున్నాయని పేర్కొంది. ధాన్యం, ఇతర పంటల కొనుగోలులో అవాంతరాలు రైతుల ఆదాయంపై గ్రామీణ డిమాండ్‌పై ప్రభావం చూపుతాయని అంచనా వేసింది. 

నిర్మాణ రంగ కార్యకలాపాలు నిలిచిపోవడం రియల్‌ఎస్టేట్‌ రంగం సమస్యలను మరింత పెంచుతాయని పేర్కొంది. ఇక ముడిచమురు ధరలు దిగిరావడం భారత్‌కు కలిసివచ్చే అంశమని వ్యాఖ్యానించింది.