ఆసియా దేశాల‌కు ఆర్థిక ఇబ్బందులు

క‌రోనా వైర‌స్ వ‌ల్ల పేద‌లు తీవ్ర ఇబ్బందులు పడ‌నున్న‌ట్లు ప్రపంచ బ్యాంక్ పేర్కొన్న‌ది.  వైర‌స్ వ‌ల్ల‌ ఆసియా దేశాల్లో ఆర్థిక స‌మ‌స్య‌లు ఎక్కువగా ఉంటాయ‌ని హెచ్చరించింది.  తూర్ప ఆసియాతో పాటు ప‌సిఫిక్ ప్రాంతంలో.. సుమారు రెండున్న‌ర కోట్ల మంది ఆక‌లితో అల‌మ‌టిస్తార‌ని ప్రపంచ బ్యాంక్ త‌న తాజా నివేదికలో పేర్కొన్న‌ది. 

దాదాపు అన్ని దేశాల్లోనూ ఆర్థిక స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని, కానీ ప‌రిశ్ర‌మ‌ల‌పై ఆధార‌ప‌డి బ్ర‌తికే వారి స‌మ‌స్య‌లు మ‌రింత ప్ర‌మాదంలో ఉంటాయ‌ని స్పష్టం చేసింది. థాయిలాండ్‌లో టూరిజంతో పాటు ప‌సిఫిక్ స‌ముద్రంలోని దీవులు, వియ‌త్నాం, కంబోడియాలోని మాన్యుఫాక్చ‌రింగ్ రంగాలు భారీగా కుదుపున‌కు గురికానున్నాయి. 

క‌నీసం మూడున్న‌ర కోట్ల మంది వైర‌స్ ప్ర‌భావంతో పేదరికంలోనే ఉండే ప‌రిస్థితి నెల‌కొన్న‌ట్లు ప్రపంచ బ్యాంక్ అభిప్రాయ‌ప‌డింది. చైనాలో రెండున్న‌ర కోట్ల మంది పేదరికంలో మ‌గ్గ‌నున్న‌ట్లు చెప్పింది.  రోజుకు ఆరు డాల‌ర్లు లేదా అంత క‌న్నా త‌క్కువ సంపాదించేవారిని వర‌ల్డ్ బ్యాంక్ పేద‌లుగా గుర్తిస్తుంది. 

తూర్పు ఆసియా, ప‌సిఫిక్ ప్రాంతాల్లో అభివృద్ధి 2.1 శాతానికి ప‌డిపోనున్న‌ట్లు ప్ర‌పంచ బ్యాంకు అంచ‌నా వేసింది. హెల్త్‌కేర్‌, మెడిక‌ల్ ఈక్విప్మెంట్ ఫ్యాక్ట‌రీల‌పై భారీ స్థాయిలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ప్ర‌పంచ బ్యాంకు ఆయా దేశాల‌కు సూచించింది.