కరోనాపై పోరులో ఆదర్శంగా భారత్

ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న కోవిడ్-19 మహమ్మారి అంతానికి ధైర్యం, సంకల్పంతో పాటు మానవ బుద్ధకుశలత, సైన్స్‌లను అస్త్రాలుగా ఉపయోగించాలని టిబెట్ మత గురువు దలైలామా పిలుపునిచ్చారు. ఈ సంక్షోభంపై కలిసికట్టుగా పోరాడేందుకు సార్క్ దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారత్  పోషించిన కృషిపై ఆయన ప్రశంసలు కురిపించారు. 

‘‘కరోనా వైరస్ కారణంగా ఇవాళ మనం అనూహ్యంగా కష్టసమయాన్ని ఎదుర్కొంటున్నాం. దీనికి తోడు ముందు ముందు మానవాళికి తీవ్ర పర్యావరణ మార్పు సహా అనేక సమస్యలు ఎదురవుతాయి.అది ఎంత కష్టమైనా కావచ్చు... సంకల్పం, ధైర్యంతో పాటు సైన్స్, మానవ బుద్ధికుశలతను అన్వయించి మన ముందున్న సమస్యను అధిగమించాలి..’’ అని ఆయన హితవు చెప్పారు. 

మన ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చినప్పుడు కొంత భయం, ఆతృతలాంటివి సాధారమేనని ఆయన తెలిపారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు అందరూ తమశక్తిమేర పోరాడుతున్నారనీ.. సమిష్టిగా పోరాడేందుకు సార్క్ దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి భారత్ ఆదర్శంగా నిలిచిందని బౌద్ధ గురువు కొనియాడారు. 

భారతీయ పురాతన సంప్రదాయం ఈ సృష్టి, మన్నిక, ప్రపంచ వినాశనం గురించి సవివరంగా చెబుతుందని దలైలామా తన ప్రత్యేక సందేశంలో పేర్కొన్నారు. 

‘అలాంటి వినాశనానికి గల కారణాల్లో సాయుధ పోరాటం, వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవాళ మనం ఎదుర్కొంటున్నది కూడా ఈ  కారణాల్లో ఒకటే. అయితే మనకు ఎదురయ్యే కష్టం ఎలాంటిదైనా.. దీని నుంచి కోలుకునేందుకు మానవాళి తమ సామర్థ్యం మేర పోరాడుతోంది..’’ అని అని వివరించారు. 

కాగా లాక్‌డౌన్ చేయాల్సిన పరిస్థిని తాను అర్థం చేసుకోగలనని చెబుతూ దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది తమ జీవనోపాధిని కోల్పోయారని దలైలామా విచారం వ్యక్తం చేశారు. తమ ఆరోగ్యానికి ప్రమాదం అని తెలిసి కూడా అనేకమంది వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది ముందుండి పోరాడుతున్నారని చెబుతూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

ఈ మహమ్మారి బారి నుండి త్వరగా కోలుకుని ప్రపంచమంతా మళ్లీ శాంతి సౌభాగ్యాలతో సంతోషంగా ఉండాలని దలైలామా ఆకాక్షించారు.