‘చాంపియన్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ అవార్డు అందుకున్న మోదీ

స్వచ్ఛ, హరిత పర్యావరణం తమ ప్రభుత్వ ప్రాథమ్యాల్లో ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వాతావరణం, విపత్తులకు సంస్కృతితో సంబంధం ఉందనీ, పర్యావరణాన్ని కాపాడటం మన సంస్కృతిలో భాగం కానంతవరకు విపత్తులను నివారించడం చాలా కష్టమైన పని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) అందించే అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ అవార్డును మోదీ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌ చేతుల మీదుగా అందుకున్నారు.

అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ–ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌) విజయవంతమవ్వడంలో కీలకపాత్ర పోషించినందుకుగాను మోదీతోపాటు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌కు సంయుక్తంగా ఈ అవార్డును ఐరాస ప్రకటించింది. అవార్డును స్వీకరించిన అనంతరం మోదీ మాట్లాడుతూ ‘వ్యవసాయ, పారిశ్రామిక విధానాల నుంచి ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం వరకు.. అన్నింట్లోనూ స్వచ్ఛ వాతావరణం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది’ అని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు భారత్‌ ఇటీవలి కాలంలో మరింతగా పాటుపడుతోందని చెబుతూ  2005తో పోలిస్తే 2020కల్లా కర్బన ఉద్గారాలను 20–25 శాతం, 2030 నాటికి 30–35 శాతం తగ్గించేందుకు తమ  ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. 2022 కల్లా ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్‌ను నిషేధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

ఈ దేశంలో కొన్ని తెగల ప్రజలు అడవుల్లో బతుకుతూ తమ ప్రాణాలకంటే అక్కడి చెట్లనే ఎక్కువ ప్రేమిస్తారని అంటూ మత్స్యకారులు తమ జీవనానికి అవసరమైన డబ్బు సంపాదించడానికి ఎన్ని చేపలు అవసరమో అన్నే పడతారు తప్ప అత్యాశకు పోరని గుర్తు చేసారు. రైతులు ఎంతో కష్టపడి దేశం ఆకలి తీరుస్తున్నారని కొనియాడుతూ చెట్లను దేవతలుగా పూజించే మహిళలు ఇక్కడ ఉన్నారని తెలిపారు. వీరందరికీ దక్కిన గుర్తింపుగా తాను ఈ అవార్డును భావిస్తున్నట్లు ప్రకటించారు.

ప్రకృతిని భారతీయులెప్పుడూ ప్రాణం ఉన్న జీవిగానే చూశారనీ, పర్యావరణాన్ని గౌరవించడం భారత సంస్కృతిలో పురాతన కాలం నుంచే భాగంగా ఉందనీ, స్వచ్ఛతా అభియాన్‌ ద్వారా ప్రజల ప్రవర్తనను మార్చడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని మోదీ చెప్పుకొచ్చారు.