నిండు గర్భిణిగా దేశీయ టెస్ట్ కిట్ చేసిన వనిత 

కరోనా మహమ్మారిపై పోరాటంలో దేశంలో పతి ఒక్కరూ తమ వంతు సాయం అందిస్తూనే ఉన్నారు. అయితే అందరిదీ ఒక ఎత్తయితే పుణె నగరానికి చెందిన వైరాలజిస్టు మినల్ ధకవే భోసలే కృషి మరో ఎత్తు. నెలలు నిండిన సమయంలో కూడా ఆమె దేశంలోనే తొలి కరోనా పరీక్షా కిట్‌ను రూపొందించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆమె కృషి ఫలించి ఆమె బృందం కేవలం ఆరు వారాల్లోనే ఈ కిట్‌ను ప్రభుత్వానికి అందించేలా చేసింది. 

పరీక్షల కోససం అధికారులకు ఈ కిట్‌ను అందించడానికి ఒక రోజు ముందు ఆమె ఆడ శిశువుకు జన్మనివ్వడం గమనార్హం. ‘ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చినట్లుగా అనిపించింది’ అని ఆమె ఫోన్‌లో చెప్పారు. అయితే నిండు గర్భిణీగా ఉంటూ కిట్‌ను రూపొందించడంలో ఆమెకు ఎన్నో సవాళ్లు ఎదురైనాయి కూడా. కిట్‌ను రూపొందించే సమయంలో గర్భానికి సంబంధించి కొన్ని సమస్యలు కూడా వచ్చాయని ఆమె తెలిపారు. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె తెలిపారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో పేదలకు తన చేతనైనంత సాయం చేయడానికి ఇదే సరయిన సమయమని తాను భావించినట్లు చెప్పారు. తాను అయిదేళ్లుగా ఈ రంగంలో ఉన్నానని, అత్యవసరమైన సమయంలో తాను పని చేయలేనప్పుడు తాను పని చేసి ఏం లాభమని ఆమె వ్యాఖ్యానించారు. గర్భం కారణంగా తాను ఆఫీసుకు వెళ్లలేకపోయినప్పటికీ ఆమె ఇంటివద్దనుంచే తన బృందానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ మార్గదర్శకంగా ఉన్నారు. 

పుణెలోని మైల్యాబ్ డిస్కవరీలో పదిమందితో కూడిన బృందం ఈ ప్రాజెక్టుపై పని చేసింది. ఈ బృందంలోని సభ్యులతో తనకు బలమైన అనుబంధం ఏర్పడిందని, వారి మద్దతు వల్లనే ఇది సాధ్యమైందని భోసలే చెప్పారు. భోసలే బృందం అందించిన కిట్ వల్ల కరోనా వైరస్ పరీక్షలకు ఇప్పుడు పట్టే ఎనిమిది గంటలనుంచి రెండున్నర గంటలకు తగ్గుతుంది. టెస్టింగ్ కిట్‌లను ఒక్కోటి రూ.4500కు కొనుగోలు చేస్తుండగా మైల్యాబ్ రూపొందించిన కిట్ ధర రూ.1200 మాత్రమే.

కాగా దేశంలోను తొలి కరోనా టెస్టింగ్ కిట్‌ను అందించిన భోసలేను మహింద్ర గ్రూపు అధినేత ఆనంద్ మహింద్ర ఒక ట్వీట్‌లో అభినందించారు. ‘మీరు బిడ్డకు, కిట్‌కే కాదు, దేశానికి ఒక ఆశాకిరణాన్ని కూడా అందించారు. మీకు సెల్యూట్ చేస్తున్నా’ అని ఆయన ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.